గద్వాల, మే 29 : రైతు బీమాపై అన్నదాతల కుటుంబాలకు ధీమా లేకుండా పోయింది. కేసీఆర్ ప్రభుత్వం లో రైతు ఏ కారణంతో అయినా మరణిస్తే బా ధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. 18 ఏండ్ల నుంచి 59ఏండ్ల లోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఏ కారణం చేతనైనా మృ తిచెందితే ఆ కుటుంబానికి రూ.5లక్షలు బీమా పరిహారం అందేలా పథకం ప్రారంభించింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ కారణాలతో మృతి చెందిన రైతుల కుటుంబాలపై కరుణ చూపకపోవడంతో ఆ కుటుంబాలు యజమానిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయి. సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడం, వచ్చిన పంటకు మద్దతు ధర రాకపోవడంతో అప్పుల బాధలు భరించలేక కుటుంబ యజమానులు కొందరు బలవంతపు మరణాలకు పాల్పడ్డారు. మరి కొందరు వివిధ కారణాలతో మృతి చెందారు. ప్రభుత్వం చేయూత లేక వారిపై ఆధారపడిన బాధిత రైతు కుటుంబాలు దిక్కు లేకుండా అయ్యాయి. కేసీఆర్ పా లనలో ప్రభుత్వ కాలంలో జిల్లాలో రైతులకు సంబంధించి ఎటువంటి బలవంతపు చావు లు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో నాటి నుం చి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పండించిన పంటలకు మద్దుతు ధర కరువు.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు, రైతు భరోసా ఇవ్వకపోడంతో పెట్టుబడికి కష్టాలు.. ఆసాములు వద్ద అప్పులు తెచ్చి పంటలు సాగు చేయడం.. చేసిన అప్పులు తీరకపోగా పలువురు ఇక చావే శరణ్యమని భావించారు. ఇలా పలువురు అన్నదాతలు బలవంతపు మరణాలకు పాల్పడ్డారు. అయితే చనిపోయిన బాధిత కుటుంబాలకు పరామర్శించే దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వం పట్టించుకోకపోగా, ఆర్థిక చేయూత ఇవ్వకపోవడంతో ఆ కుటుంబాలు పూట గడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక వెన్నుదన్నుగా ఉండేలా నాటి కేసీఆర్ ప్రభు త్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం కాంగ్రెస్ పాలనలో సక్రమంగా అమలు కావ డం లేదు. దీంతో ఎటువంటి ఆర్థిక చేయూత దక్కక రైతు కుటుంబాలు వారి పిల్లలను పోషించుకోవడానికి.. వారికి చదవులు చెప్పించడానికి నానా అవస్థలు పడుతూ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో గతేడాది ఆగస్టు నుంచి ప్రస్తుత మే వరకు 476 మంది రైతులు మృతి చెందారు. అయినా వారి కుటుంబాలకు చేయూతనివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేకుండా పో యిందన్న ఆరోపణలు ఉన్నాయి.
బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన రైతుబీమాను రెండేళ్లు కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. కానీ ఈ ఏడాది మార్చి నుంచి బాధిత కుటుంబాలకు రైతు బీమా డబ్బులు ఇవ్వడం లేదని తెలిసింది. ఈ విషయంపై అధికారులు ఆరా తీస్తే ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఆ తర్వాత పంపిన క్లయిమ్స్పై ఎల్ఐసీ చెల్లింపులు చేయకపోవడంతో రైతు కుటుంబాలకు పరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గద్వాల జిల్లాలో గతేడాది ఆగస్టు 14 నుంచి ఇప్పటి వరకు 476 రైతులు మృతి చెందారు. వీరిలో మార్చి 31 లోపు మరణించిన 299 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఆ తర్వాత మరణించిన 177 రైతుల క్లయిమ్స్ వివరాలను ఎల్ఐసీకి పంపించినా పరిహారం ఇప్పటి వరకు రాలేదు. మరో 60 మంది రైతు కుటుంబాల క్లయిమ్స్ ఫైల్స్ వ్యవసాయశాఖ వద్ద పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. బడ్జెట్లో రైతు బీమాకు ఎలాంటి నిధు లు కేటాయించకపోవడం.. మార్చి తర్వాత మరణించిన రైతు కుటుంబాలకు అందుతుం దా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రైతు మరణించిన తర్వాత వారం, పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి రైతుబీమా సాయం అందేది. కానీ రేవంత్ పాలనలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతోంది. గడువు ఈ ఏడాది ఆగస్టు 13 వరకు ఉంది.. ఆలోపు ప్రభుత్వం పరిహారం అందిస్తుందో? లేదో? వేచి చూడాలి.