వనపర్తి అంటేనే టక్కున గుర్తొచ్చేది ఎడ్యుకేషన్.. దశాబ్దాల నుంచి విద్యనందించే కుసుమంగా గుర్తింపు పొందింది. ఇక్కడ 1959లోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైంది. అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఈ కాలేజీని ప్రారంభించిన ఘనత ఉన్నది. రాష్ట్రంలోనే తొలి మత్స్య కళాశాల పెబ్బేరులో 2017లో ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఉన్నత విద్యకు అడుగులు పడ్డాయి. గతేడాది ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో విద్యాహబ్‌గా మారింది. అలాగే అగ్రికల్చర్ మహిళా డిగ్రీ, నర్సింగ్, ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఎన్నో ఇంటర్ జూనియర్ కళాశాలలు వెలిశాయి. ఇక్కడ చక్కని విద్యాబోధన అందుతుండగా, విద్యార్థులు ప్రతిభ చాటుతుండడంతో రాష్ట్రస్థాయిలో పేరు సంపాదించింది. ఇక్కడ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో వనపర్తి పట్టణం విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
– వనపర్తి, జూన్ 19
వనపర్తి, జూన్ 19 : సమైక్య రాష్ట్రంతోపాటు ఉమ్మడి పాలమూరులోనే విద్యలో వనపర్తికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తమ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులతో వనపర్తి ముందంజలో ఉన్న సందర్భాలు ప్రతి విద్యా సంవత్సరం చూస్తూనే ఉంటాం. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రి నిరంజన్‌రెడ్డి పట్టుబట్టి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి వనపర్తిని జిల్లాకేంద్రంగా మార్చారు. ఈక్రమంలో రాష్ట్రంలోనే తొలి వ్యవసాయ మహిళా కళాశాల, మత్స్య కళాశాలను ఏర్పాటు చేయించారు. అదేవిధంగా తొలి విడుతలో వనపర్తికి మెడికల్ కళాశాలతోపాటు నర్సింగ్, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు, రాష్ర్టాలకు వెళ్లకుండా వనపర్తిలోనే అన్ని విద్యాసంస్థలు అందుబాటులోకి తేవడంతో జిల్లావాసులు ‘విద్యాపర్తి’గా పిలుచుకుంటున్నారు.
సకల సౌకర్యాలతో భవనాల నిర్మాణాలు
మెడిసిన్, ఇంజినీరింగ్, నర్సింగ్, మత్స్య, పీజీ, వ్యవసాయ మహిళా కళాశాలల్లో విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్న విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకపోగా.. ఇతర రాష్ర్టాల నుంచి విద్యార్థులు వనపర్తికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సకల సౌకర్యాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో భవనాలను నిర్మించారు.
జిల్లాగా ఏర్పడిన తర్వాత మంత్రి నిరంజన్‌రెడ్డి పలు విద్యా సంస్థలను వనపర్తికి తీసుకొచ్చారు. దీంతో హైదరాబాద్ వంటి మహానగరాలకు విద్యార్థులు వెళ్లకుండా ఇక్కడే విద్యనభ్యసిస్తుండగా.. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు సైతం లభించాయి. విద్యతోపాటు ఉపాధి రంగం అభివృద్ధి చెందడంతో వలస వెళ్లిన నిరుద్యోగులు కూడా వనపర్తికి తిరిగొస్తున్నారు. జిల్లాకేంద్రలో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలను 1959లోనే ప్రారంభించారు.