కొల్లాపూర్ : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ( Tranfarmers ) ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయని నార్లాపూర్( Narlapur ) గ్రామస్థులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుడు వెంకయ్య ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని నార్లాపూర్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. ట్రాన్స్పార్మర్ల చుట్టూ విపరీతమైన గడ్డి పెరగడంతో పశువులు మేత మేసేందుకు వెళ్లి ప్రమాద బారిన పడుతున్నాయి.
ట్రాన్స్పార్మర్ల వద్ద గడ్డి మొత్తం కప్పి వేయడంతో నిత్యం గ్రామంలో ఎల్టీలైన్లో ఓల్టేజి సమస్యలు తలెత్తి ఇళ్లలో ఉండే బల్బులు, టీవీలు, ఫ్రిజ్లు కాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్ఎల్ఐ అంజనగిరి రిజర్వాయర్క్ సమీపంలోనే గ్రామం ఉండడం వల్ల విష సర్పాలు వస్తున్నాయని, విద్యుత్ సమస్యతో చీకట్లో విష సర్పాల బెడద ఎక్కువగా ఉన్నదని ఆరోపిస్తున్నారు. వెంటనే విద్యుత్ ట్రాన్స్పార్మర్ల చుట్టూ ఉన్న గడ్డిని తొలగించి కంచె ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ చిట్టెమ్మ వెంకటస్వామి అధికారులను డిమాండ్ చేశారు.