కేంద్ర ప్రభుత్వం ‘పాలమూరు’పై అక్కసు వెళ్లగ క్కుతున్నది. కృష్ణా జలాల వాటా తేల్చకుండా ఇరురాష్ర్టా లకు పంచాయితీ పెడుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగా రెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 16 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలని మొదటి నుంచి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ సర్కార్‌ను డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ జాతీయ హోదా కల్పిస్తామని మోదీ ప్రకటించి.. ఇప్పుడు కిమ్మన కుండా ఉంటున్నారు. పీఆర్‌ఎల్‌ఐని కేవలం రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. ఈ సారి ప్రవేశట్టిన బడ్జెట్లో అసలు ఎత్తిపోతల ఊసే ఎత్తలేదు. ఎనిమిదేండ్లుగా కాలయాపన చేయ డమే కాకుండా.. కోర్టుల్లో కేసులు వేస్తూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ, సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.1,187.64 కోట్లు కేటాయించి చిత్తశుద్ధి చాటుకున్నారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరువు కాటకాలు.. ఆకలిచావులు.. పొట్టచేతపట్టుకొని మహానగరాలకు వలసబాట పట్టిన పాలమూరు ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. రెండు జీవనదులు పారుతున్నా పొలాలు బీళ్లుగా మారడంతో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైన పాలమూరు జిల్లా తెలంగాణ ఏర్పడ్డాక అన్ని రంగాల్లో ముందుకుపోతున్నది. పాలమూరు పచ్చబడితే తమ ఉనికికే ప్రమాదమనుకున్న విపక్షాలు కుయుక్తులు ప్రారంభించాయి. ఈ జిల్లా రూపురేఖలే మార్చే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తమ రాజకీయ అస్త్రంగా మార్చుకున్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని జిల్లాకు అన్యాయం చేస్తున్నాయి. 2014లో తెలంగాణ అవిర్భావాన్ని పార్లమెంట్లో ప్రకటించాగానే.. ఎన్నికల ముందు సాక్షాత్తు ప్రధాని మోదీ ఎన్నికల బహిరంగ సభలో తాము అధికారంలో వస్తే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలో వచ్చాక ఆంధ్రప్రదేశ్ విభజనచట్టం కింద ఇరు రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన నీళ్లు, నిధులను కేంద్రం మోకాలడ్డుతున్నది. కృష్ణా జలాల్లో నీటివాటా తేల్చకుండా రాజకీయం చేస్తున్నది. ఫలితంగా కోర్టులకు కెక్కే అవకాశాన్ని కల్పించి చోద్యం చూస్తుంది.
ఎనిమిదేన్నర ఏండ్లు గడిచినా జాతీయ హోదా ఇస్తామన్న మాటమార్చి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నది. తాజాగా బడ్జెట్లో పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు ప్రస్తావన తేకుండా మొండిచెయ్యి చూపింది. ఈ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డుపడుతున్నా.. కోర్టు ద్వారా నిలవరించే ప్రయత్నం చేస్తున్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 1187.64కోట్లు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నది. ఇటీవల నారాయణపేట బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడుతూ ఆరునూరైన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి కృష్ణాజలాలు పారిస్తామని చెప్పారు.
పీఆర్ఎల్ఐ పనులు ఊపందుకున్నాయి. నిత్యం 70 టీఎంసీలు ఎత్తిపోసే ఈ పథకం పనులు దాదాపు 60శాతం పూర్తయ్యాయని అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో రూ.1187.64కోట్లు కేటాయించారు. ఇప్పటికే నార్లాపూర్, కర్వెన, వట్టెం, ఏదుల, ఉదండాపూర్ రిజర్వాయర్ల కింద భూసేకరణ, పునరావాసంతోపాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందించారు. దాదాపు 80శాతం వరకు భూసేకరణ, ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. ప్రాజెక్టుకు క్లియరెన్స్ రాగానే పనులు ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. మెయిన్ టన్నేల్లో పనులు పూర్తిచేశారు. ఐదు రిజర్వాయర్ల పనులు తుదిదశకు చేరకున్నాయి. వానకాలంలో కురిసిన వర్షాలకు రిజర్వాయర్లలో సుమారు 1-3టీఎంసీల నీరు నిల్వ ఉంటుందంటే ప్రాజెక్టు పూర్తయితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు కలిపి 16లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడి ప్రాజెక్టుకు మరోసారి కేంద్రం మొండిచెయ్యి చూపింది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాజెక్టు ఊసే లేదు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 2015 జూన్ 11న పాలమూరు-రంగారెడ్డి పథకానికి శంకుస్థాపన చేశారు. జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసింది. అనేకసార్లు కేంద్ర మంత్రులు, ప్రధానిని కలిసి విన్నవించారు. అయితే ఈ ప్రాజెక్టును గాలికొదిలేసి పోలవరం ఎత్తిపోతలకు జాతీయహోదా కల్పించారు.
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్, బీజేపీ నేతలు పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే తమ రాజకీయ జీవితానికి చరమగీతం పాడాల్సి వస్తుందని కోర్టుకెక్కారు. ఈ పథకం కాంగ్రెస్ హయాంలో పురుడుపోసుకున్నా ఏపీ నేతల కనుసన్నల్లో ఉన్న అప్పటి పాలకులు బయటకు రానీయకుండా కల్వకుర్తి ఎత్తిపోతలతోనే సరిపెట్టారు. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడంతో రాజకీయ నిరుద్యోగులైన నాగం జనార్దన్‌రెడ్డి, డీకే అరుణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి, వంశీకృష్ణ, రేవంత్‌రెడ్డి, మల్లురవి లాంటి నేతలు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేశారు. ఎన్జీటీలో, హైకోర్టులో కేసుల మీద కేసులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు కోర్టులో కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకుంటున్నది వాస్తవమే. బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. జాతీయ హోదా వస్తే ఈ ప్రాజెక్టు స్వరూపమే మారిపోతుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకివ్వరు. ఇక్కడి బీజేపీ నేతలు ఏం చేస్తున్నట్లు.? పాలమూరు ప్రజలమీద మమకారం ఉంటే ప్రధాని మోదీని నిలదీయాలి. లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర