వనపర్తి చెరువులు పూర్వవైభవాన్ని సంతరించు కున్నాయి. పట్టణం నలు దిశలా కాకతీయుల కళావైభవం రూపుదిద్దుకుంటున్నది. గొలుసుకట్టు విధానంతో చెరువులు, కుంటల వద్ద జలదృశ్యాలు సాక్షాత్కా రిస్తున్నాయి. మరోవైపు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నారు. రాబోయే రోజుల్లో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృషితో రాజనగరం అమ్మ చెరువు, చిట్యాల నల్ల చెరువు, తాళ్ల చెరువు, లక్ష్మీకుంటను రూ.కోట్లు ఖర్చు చేసి సుందరీక రించారు. మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించి ఓపెన్ జిమ్‌తో ప్రజలు, చిల్డ్రన్స్ పార్కుతో చిన్నారులు ఆహ్లాదంగా గడిపేలా పనులు చేపడుతున్నారు. చెరువు కట్టలను బలోపేతం చేసి పర్యాటకులు కూర్చొని అందాలను తిలకించేలా.. సేద తీరేలా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో తాగు, సాగునీటికి ఢోకా లేకపోగా పర్యాటక హబ్‌గా మారనున్నది.
వనపర్తి, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : కాకతీయుల కళావైభవం పునరుద్ధరించబడుతున్నది. నీటి లభ్యత కోసం శాశ్వత ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. కాకతీయుల నాటి గొలుసుకట్టు విధానంలో వనపర్తి జిల్లా కేంద్రం చుట్టూ చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో సందర్శకుల మన స్సు దోచి పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా సాగు, తాగునీటికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాధాన్యమిచ్చారు. అదే కోవలో పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. పట్టణ భవిష్యత్ నీటి అవసరాలను తీర్చడంతోపాటు అటవీ జీవుల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో చెరువులు, కుంటలు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో పట్టణానికి మరింత శోభ చూకూరు తున్నది. ఈ చెరువుల్లో వేసవిలో కూడా నీరు నిండుగా ఉండేలా పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. నిండుగా నీరు ఉంటే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో పుష్కలంగా నీటి వనరులు పెరగనున్నాయి. స్థానికులకు నీటి లభ్యత మెరుగు కానున్నది. ఇకపై నీటి కటకటకు ఫుల్స్టాప్ పడనున్నది. ఇందుకోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విధానాన్ని రూపొందించారు. లక్ష్మీకుంట, అమ్మచెరువు, తాళ్ల చెరువు, నల్ల చెరువును ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మర్రికుం ట చెరువు పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నా రు. మర్రికుంటతోపాటు హౌసింగ్‌బోర్డు కాలనీకి నీటి ని అందించాలన్న లక్ష్యంతో పునరుద్ధరణ చేపట్టారు.
వనపర్తి పట్టణం చుట్టూ నలు దిశలా నాలుగు చెరువులను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక నిధులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రాజనగరం ప్రాంతంలో అమ్మ చెరువు, చిట్యాల మార్గంలో నల్ల చెరువు, పట్టణంలో కలిసి ఉన్న తాళ్ల చెరువు, పట్టణానికి జలాధారమైన లక్ష్మీకుంటను అభివృద్ధి చేస్తున్నారు. చిట్యాల, గోపాల్పేట మార్గంలో ఉన్న నల్ల చెరువును దాదాపు రూ.9 కోట్లతో తీర్చిదిద్దుతున్నారు. ట్యాంక్‌బండ్ నిర్మించి పట్టణ ప్రజలు ఆహ్లాదంగా గడిపేలా తయారు చేస్తున్నారు. ఇప్పటికే పనులు పూర్తికావచ్చాయి. ట్యాంక్‌బండ్ మీదుగా గోపాల్పేట, చిట్యాల మార్గం మరింత దగ్గర కానున్నది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డును పోలి ఉండటంతోపాటు హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ తరహాలో పనులు చేపడుతున్నారు. పార్కులు, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు నల్ల చెరువు ప్రాంతంలో నెలకొల్పుతున్నారు. అంతేకాకుండా తాళ్ల చెరువునూ రూ.కోటితో అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలు సాయంత్రం వేళ సేద తీరేలా పనులు చేపడుతున్నారు. కట్టను బలోపేతం చేయడంతోపాటు సందర్శకులు కూర్చొని చెరువు అందాలను వీక్షించేలా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్కు, అక్కడకి వచ్చే వారి కోసం టాయిలెట్లను నిర్మిస్తున్నారు.
లక్ష్మీకుంటపై మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. 4 కిలోమీటర్ల దూరం ఉన్న ఈదుల చెరువు నుంచి ఈ కుంటకు నీటిని తరలిస్తున్నారు. నీటితో పూర్తిగా నిండటంతో చుట్టుపక్కల ప్రాంతాలకు నీటి ఎద్దడి తీరనున్నది. అలాగే అటవీ జీవులకు ప్రాణాధారంగా మారనున్నది. ఇందుకోసం ఈదుల చెరువు నుంచి లక్ష్మీకుంటకు పైపులైన్ ఏర్పాటు చేశారు. నీటిని పంపింగ్ చేయడానికి 20 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మూడు మోటార్లను ఏర్పాటు చేశారు. లక్ష్మీకుంటలో నీరు నిల్వ లేకుండా ఉండటంతో గతేడాది బోరు ఎండిపోయి సమీపంలోని కాలనీల్లో నీటిఎద్దడి తలెత్తింది. అంతేకాకుండా దాహార్తితో ప్రతి సంవత్సరం నెమళ్లు, దుప్పులు చనిపోయేవి. వీటిని దృష్టిలో ఉంచుకుని మంత్రి నిరంజన్‌రెడ్డి పునరుద్ధరణ పనులు చేపట్టారు. నీటి సౌకర్యంతోపాటు పర్యాటక ప్రాంతంగా లక్ష్మీకుంటను తీర్చిదిద్దారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ కుంట ఇప్పుడు అందాలతో కనువిందు చేస్తున్నది.
చెరువులు, కుంటలు అభివృద్ధి చేయడంతో నీటి కటకట ఉండదు. మంత్రి నిరంజన్‌రెడ్డిని గెలిపించుకోవడంతో ఎండిపోయిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నాడు ఎండాకాలం వస్తే గొంతు తడుపుకోవడానికి నీళ్లు ఉండేవి కావు. బోర్లు, బావులు ఎండి పోయేవి. కానీ నేడు చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలమైంది. చెరువులు సుందరంగా మారి.. జలకళను సంతరించుకుంటే సంబురమేస్తున్నది. మంత్రికి వనపర్తి ప్రజలు రుణపడి ఉండాలి.
– నర్సింహ, రైతుబంధు సమితి అధ్యక్షుడు, వనపర్తి మండలం
చెరువుల అభివృద్ధితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తాగు, సాగు నీటితోపాటు భూగర్భ జలాలు పెరిగి నీటి ఎద్దడి ఉండదు. అందుకే మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టి సారించి ప్రత్యేక నిధులతో చెరువులను సుందరీకరిస్తున్నారు. పట్టణం చుట్టూ అందమైన చెరువులు, పార్కులు ఏర్పాటు చేస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం మున్సిపాలిటీ నుంచి మౌలిక సౌకర్యాలకు నిధులు కేటాయించాం. దీంతో దశాబ్దాల చరిత్ర ఉన్న చెరువులు సొబగులు సంతరించుకుంటున్నాయి. వనపర్తి అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ కళాశాలలు వంటి గొప్ప విద్యా సంస్థలు రావడంతో వనపర్తి స్వరూపమే మారిపోయింది.
– గట్టు యాదవ్, బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు