మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 14: రాష్ట్ర ఉన్న త విద్యా మండలి, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు సానుకూల స్పందన రావడంతో వాయిదా పడుతూ వచ్చిన డిగ్రీ వార్షిక పరీక్షలు ఎట్టకేలకు ఈనెల 15వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి యూ నివర్సిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యూజీ (డిగ్రీ) పరీక్షలు కొనసాగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్షలను బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం విధితమే. ముఖ్యమంత్రి, ఉ న్నత విద్యామండలి, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు సానుకూల స్పందన రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇందు లో భాగంగా పీయూ విడుదల చేసిన రీ షెడ్యూల్ ప్రకారంపరీక్షలు ప్రారంభం కానున్నాయి.
నేటినుంచి పరీక్షలు ప్రారంభం
పాలమూరు యూనివర్సిటీ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 15నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులు గతం లో తీసుకున్న పాత హాల్ టికెట్‌తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఏ(ఎల్) (సీబీసీఎస్) పరీక్షల నిర్వహణకు సంబంధించి రీషెడ్యూల్కు అనుగుణంగా పరీక్షలు కొనసాగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
యూజీ 2, 4, 6వ సెమిస్టర్స్ (రెగ్యూలర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్)తో పాటు సెమిస్టర్ -5 (బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్) థియరీ పరీక్షలు, ఫోర్త్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ(బీఎస్సీ బీఈడీ అండ్ బీఏ, బీఈడీ) 2, 4, 6వ సెమిస్టర్ (రెగ్యూలర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్) థియరీ పరీక్షలు 15నుంచి టైంటేబుల్‌కు అనుగుణంగా కొనసాగుతాయి. ఈ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో పీయూ పరీక్షల నిర్వహణ అధికారి ప్రవీణ సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను వివరించారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే యూనివర్సిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా..
ప్రైవేట్ అండ్ డిగ్రీ కళాశాలలకు పెండింగ్‌లో ఉ న్న ఫీజు రియింబర్స్‌మెంట్‌ను విడుదల చేయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యార్థుల భవిష్యత్, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహణకు అంగీకరించాం. ఇప్పటికే అప్పుల ఊబీలో కూరుకుపోయి కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇచ్చి న హామీ మేరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను త్వరగా విడుదల చేసి ప్రైవే ట్ కళాశాలల యాజమాన్యాలకు ఆర్థిక భరోసా కల్పించాలి.
– జహీర్ అక్తర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, పీయూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్
రీషెడ్యూల్కు అనుగుణంగా..
విద్యార్థులు గతంలో పొందిన హాల్‌టికెట్లు లేదా కొత్తగా హాల్ టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. కళాశాల ఐడీకార్డుతోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ ప్రూఫ్ వెంట తీసుకురావాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. నిర్దేశిత సమాయానికంటే ముందుగానే పరీక్షా కేం ద్రాలకు చేరుకోవాలి.
– ప్రవీణ, పరీక్షల నిర్వహణ అధికారిణి, పీయూ