కొల్లాపూర్, జూన్ 5 : ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రతికూల చర్యలకు లొంగకుండా, దాడులకు బెదరకుండా తనను జనంలోకి నడిపించిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తన వెన్నంటి నడిచిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా, మాజీ ఎమ్మెల్యేలు బీరం, మర్రి, గువ్వల, జైపాల్యాదవ్తోపాటు పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నడిగడ్డ మట్టిబిడ్డగా తనను విశ్వసించి 3,21,343 అమూల్యమైన ఓట్లతో ఆశీర్వదించిన ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి అభినందనలు తెలిపారు.