Farmers Protest | నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణ కోసం రైతులకు ఎలాంటి సమాచారం అందించకుండా సర్వే చేపడుతున్నారని ఆరోపిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేపల్లి గ్రామంలో పోలీసుల బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా భూమిని కోల్పోతున్న రైతులు పురుగుల మందు డబ్బా చేత పట్టుకొని సర్వే అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అడ్డు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ ఇలాగే సర్వే చేయడానికి వస్తే ఆఫీసర్లను రైతులు తిప్పిపంపారు.
రూ.లక్షల్లో విలువ చేసే భూములు తాము ఇవ్వబోమని, భూములు పోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని రైతులంటున్నారు. రైతాంగం అభిప్రాయాలు తీసుకోకుండా ఎత్తిపోతల పథకాలు చేపట్టి కుటుంబాలను రోడ్డుపైకి లాగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఏర్పాటు చేసే తమ అల్లుడి కంపెనీ కోసం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
అయినా భారీ బందోబస్తు మధ్య పోలీసులు రైతులను చుట్టుముట్టి ఆఫీసర్లతో సర్వే నిర్వహిస్తున్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల నిరసనలు లెక్కచేయకుండా సర్వే నిర్వహిస్తున్నారు. ఇటీవల నారాయణపేట జిల్లాకు వచ్చిన ఐజీ సత్యనారాయణ ఆదేశాలతో పోలీసులు, రెవిన్యూ ఆఫీసర్లు సంయుక్తంగా సర్వే చేపడుతున్నారు. సర్వే బృందానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ సర్కార్ పోలీసుల బందోబస్తుతో సర్వే చేపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సర్వే చేసుకున్న సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు భీష్మించారు.