మాండస్ తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మూడురోజులుగా ఈదురు గాలులు వీస్తుండడంతో చలితీవ్రత పెరిగింది. ఉదయం 9 దాటినా ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరో రెండు, మూడు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటుంది. కాగా, సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు పట్టింది. వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మిరప పంట తడిసి ముద్దయింది. మల్దకల్ బ్రహ్మోత్సవాల్లో ఆటవస్తువులు, తినుబండారాల దుకాణాల్లోకి వర్షపు నీరు వచ్చింది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.
– మహబూబ్నగర్, డిసెంబర్ 12
మహబూబ్నగర్, డిసెంబర్ 12: చిరుజల్లులు.. చల్లని గాలులు వీయడంతో చలితీవ్రత మరింత ఊపందుకుంటుంది. మూడురోజులుగా ఈదురుగాలులతో చలి తీవ్రతను చూపిస్తుంది. ఉదయం 8నుంచి సాయంత్రం 6గంటలలోపు మాత్రమే ప్రజలు బయటకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒకే తరహాలో వాతావరణం చల్లగా ఉంటుంది. మాండస్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లని ప్రదేశంగా మారిపోయింది. మంగళవారం ముసురు వాన ఉదయం నుంచి రాత్రి వరకు కురిసింది. మరో రెండు, మూడు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటుంది.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. సోమవారం ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26.3 డిగ్రీలు, కనిష్ఠంగా 21.6డిగ్రీలకు చేరింది. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ప్రజలు ఉదయం 8గంటల వరకు ఇంటికే పరిమితమతున్నారు. సాయంత్రం 5గంటలకే ఇంటికి చేరుకుంటున్నారు. చలిని దూరం చేసేందుకు స్వెటర్లు, మఫ్లర్లతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు చలి తీవ్రతకు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ముసురుతో రైతన్న ఇక్కట్లు
కురుస్తున్న ముసురు వానకు రైతులు ఇబ్బందులను పడుతున్నారు. ఇప్పటికే వేరుశనగ పూర్తిస్థాయిలో సాగు చేసినప్పటికీ చిరుజల్లులతో పంటకు తెగలు సోకే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా కొనుగోలు చేయని ధాన్యం కల్లాల్లోనే ఉండడంతో టార్పాలిన్ కవర్లు కప్పి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వరి కోతలు పూర్తి అయినప్పటికీ పలు ప్రాంతాల్లో కోత తుది దశలో ఉంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ముసురు వానలకు మిరప పంట తడిసింది. మల్దకల్ బ్రహ్మోత్సవాల్లో ఆటవస్తువులు, తినుబండారాల దుకాణాల్లోకి వర్షపు నీరు వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంతోపాటు ఆయా మండలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు పట్టింది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.