వనపర్తి టౌన్, ఆగస్టు 19 : తెలంగాణలో 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని కోరుతూ బుధవారం పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాం డ్ చేశారు. బుధవారం విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల నుంచి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ విద్యార్థులు మాట్లాడుతూ ఐటీఐలు, లేబర్ డిపార్ట్మెంట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి శక్తి (యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ) పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్య అనేది సాధారణ స్కిల్ ట్రైనింగ్ వ్యవస్థ కాదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేసే ప్రత్యేక ఇంజినీరింగ్ విద్యావ్యవస్థ అని అన్నారు.
డిప్లొమా విద్యార్థులు జూనియర్ ఇంజినీర్లు, సైట్ సూపర్వైజర్లు, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది తదితర సాంకేతిక ఉద్యోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందించే ప్రధాన వ్యవస్థ పాలిటెక్నిక్ కళాశాలలు అని అన్నారు. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యలో ముం దుకు వెళ్లేందుకు లాటరల్ ఎంట్రీ వంటి అవకాశాలను కల్పిస్తున్న ఈ వ్యవస్థను బలహీనపరిచే నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.