కల్వకుర్తి/వెల్దండ, జూన్ 4 : రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తెలంగాణ ఉనికికే ముప్పు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ స్వలాభం కోసం అభివృధ్ధి శిఖరంపై ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసిందని ఆమె తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
గురువారం వెల్దండ మం డలం కొట్ర సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన కల్వకుర్తి నియోజకవర్గ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సభ్వత్వాల జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాసులు, నియోకవర్గ ఇన్చార్జి వేద రజనీసాయిచంద్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్‌తో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఆంధ్రలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ఒకే డైరెక్షన్లో పనిచేస్తూ తెలంగాణకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా బనకచర్ల ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు మూడు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీఆర్ఎల్ఐ పరిస్థితి చూసిన బీఆర్ఎస్ ప్రాజెక్టుల పాదయాత్రకు కార్యచరణ ప్రకటించగానే ఉలిక్కిపడిన సీఎం పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల యాత్ర చేపట్టారని విమర్శించారు.
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుతుందని, తెలంగాణ వాటాకు కోత పెట్టి జలాలను ఆంధ్రకు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు అడ్డుకోవడంలేదని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సీఎం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోతే బీఆర్ఎస్ తిరిగి ప్రాజెక్టు సాధన పేరిట పోరాటాలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో దోపిడీలు, బలత్కారాలు, హింసాత్మక సంఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి, ఆత్మ గౌరవానికి, అస్థిత్వానికి కేసీఆర్ శ్రీరామరక్ష అని.. అందుకే పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారని ఆమె ఉద్ఘాటించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో, పార్టీ సభ్యత్వ నమోదులో బీఆర్ఎస్ కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఓట్ల వడపోతలో పోలింగ్ బూత్ ఇన్చార్జీలు అత్యంత ఆప్తమత్తంగా ఉండాలని, ఇందుకు సంబంధించిన విషయాలను, సభ్యత్వాలకు సంబంధించిన టెక్నాలజీని పార్టీ సభ్యత్వ ఇన్చార్జీలు అవగాహన కల్పిస్తారని వివరించారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు రక్షణ కవచంగా నిలవాలని సభ్యత్వాల జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. డిజిటల్ సభ్యత్వాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సభ్యత్వాల నమోదులో మూస పద్ధతికి చెల్లుచీటి పడిందని ప్రస్తుతం డిజటల్ పద్ధతిలో టెక్నాలజీ వాడుకుంటున్నామన్నా రు. కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వేద రజనీసాయిచంద్ మాట్లాడుతూ తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీయేననన్నారు. బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా మారాలంటే సభ్యత్వాలలో నెంబర్ వన్‌గా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్‌లు మాట్లాడుతూ సభ్వత్వాల్లో కల్వకుర్తిని టాప్‌లో ఉంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ డిజటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ గురించి వివరించారు. అనంతరం పలు తీర్మాణాలు చేసి సమావేశంలో ఆమోదింపజేశారు. కృష్ణానదిలో తెలంగాణకు 500 టీఎంసీలు కేటాయించాలని, భీమా ప్రాజెక్టుకు 25 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25 టీఎంసీలు, కోయిల్ సాగర్‌కు 5 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 50టీఎంసీలు, పాలమూరు-రంగారెడ్డికి120 టీఎంసీలు నికరజలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు పార్టీ జెండాను ఎగరువేసి కార్యకర్తల అవగాహన సదస్సు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు ఎడ్మసత్యం, శ్రీశైలం, బీఆర్ఎస్ నాయకులు పుట్టరాంరెడ్డి, అర్జున్‌రావు, మాజీ ఎంపీపీలు నిర్మల, శ్రీనివాస్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు విజితారెడ్డి, దశరథ్‌నాయక్, సింగిల్‌విండో అధ్యక్షుడు జూపల్లి భాస్కర్‌రావు, సూర్యప్రకాశ్‌రావు, ఎల్ఎన్రెడ్డి, విజయ్‌గౌడ్, గోవర్ధన్, ఈశ్వరయ్య, శ్రీనివాస్ గుప్తతో పాటు వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.