మానవపాడు, మే 2 : ఇందిరమ్మ ఇళ్లు మాకొద్దు సారూ అంటూ 69మంది లబ్ధిదారులు ఎంపీడీవోకు వినతిపత్రాలు అందించిన ఘటన మండలంలోని చంద్రశేఖర్‌నగర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం నిధులు లేవని అన్నింట్లోనూ కోతలు విధిస్తున్నదని, నిర్మాణాలు చేపట్టాక బి ల్లులు రాకపోతే మేం అప్పుల పాలవుతామని గృహనిర్మాణాలకు నిరాకరణ చెప్పారు.
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన చంద్రశేఖర్‌నగర్‌లో లబ్ధిదారులు గృహనిర్మాణానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం. చంద్రశేఖర్‌నగర్, శ్రీనగర్, చంద్రశేఖర్‌నగర్ క్యాంప్‌నకు 114ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు వస్తాయని అధికారులు చెప్పగా, ప్రస్తుతం అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాక, డబ్బులు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆరుగురివి డబుల్ దరఖాస్తులు రావడంతో వాటిని తిరస్కరించారు.
గృహనిర్మాణం చేసుకోవాలని 36 మంది స్థలాలకు మార్కింగ్ ఇవ్వగా, అందులో 9 మంది మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. 69మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టలేమని తేల్చిచెప్పారు. కాగా, 9 ఇండ్లకు బేస్మెంట్ పూర్తి చేసుకోగా, ముగ్గురికి రూ.లక్ష చొప్పున బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసినట్లు ఎంపీడీవో తెలిపారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే బిల్లులు జమచేస్తామన్నారు.