వనపర్తి టౌన్, జూలై 14;విద్యారంగానికి తెలంగాణ సర్కారు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు వెలుస్తున్నాయి.. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరు ఉండి మరొకరు లేని వారు, వలస వెళ్లిన పిల్లల కోసం ప్రభుత్వం కేజీబీవీలను స్థాపించింది. పదేండ్ల కిందట కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. దీనికి తోడు ఆశించిన ఫలితాలు కూడా సాధించిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం కేజీబీవీల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చింది. నూతన భవనాలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు మెరుగైన విద్యాబోధన, పౌష్టికాహారం, డిజిటల్ తరగతులతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరం కస్తూర్బా విద్యాలయాల్లో నో అడ్మిషన్ బోర్డులు పెడుతున్నారు. విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సీట్లు కావాలని రిక్వెస్ట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి.
పెరిగిన విద్యార్థుల సంఖ్య..
వనపర్తి జిల్లాలో 15 కేజీబీవీలు ఉండగా, ఈ ఏడాది 6వ తరగతిలో 766 మంది విద్యార్థినులు చేరారు. జిల్లావ్యాప్తంగా 3,506 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ప్రవేశాలు కల్పిస్తూ ఒక్కో కేజీబీవీల్లో 40 సీట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. కానీ జిల్లావ్యాప్తంగా 15 కేజీబీవీలు ఉన్నప్పటికీ, ప్రతి పాఠశాలల్లో 50నుంచి 60సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సీట్లను భర్తీ చేసే క్రమంలో తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి నెలకొనడంతో త్రిమ్యాన్ కమిటీ వేసి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు. ప్రతి మండల కేంద్రంలో కేజీబీవీ ఉండడంతో స్థానికత ఆధారంగా మొదటి ప్రాధాన్యత ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్, తల్లిదండ్రులు వలసలు వెళ్లిన వారికి, సీడబ్ల్య్యూసీ వారు సూచించిన పిల్లలకు ప్రాధాన్యతను ఇస్తూ అడ్మిషన్లు కల్పించారు.
కళాశాల విద్యగా పెంపు..
గత ఏడాది కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేస్తూ పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు విద్యను అందిస్తున్నారు. అం దులో భాగంగా వనపర్తి జిల్లాలో 5 కేజీబీవీలు కళాశాల విద్యను బాలికలకు అందిస్తున్నారు. ఆత్మకూరు, అమరచింత, గోపాల్పేట, వనపర్తి కేజీబీలలో కళాశాల విద్య కొనసాగుతుంది. ఈ కళాశాలల్లో ఎంపీసీ, సీఈసీ, బైపీసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఆంగ్ల మాద్యమాల్లో బోధన కొనసాగుతుంది. మొత్తం 5 కళాశాలలకు కలిపి మొదటి సంవత్సరంలో 302 మంది విద్యార్థినులు చేరారు. ఒక్కో కోర్సులో 40సీట్లు ఉండగా అందుకు రెట్టింపు విద్యార్థినులు చేరారు.
డిజిటల్ బోధన..
వనపర్తి జిల్లావ్యాప్తంగా 15 కేజీబీవీల్లో మారుతున్న బోధన విధానానికి అనుగుణంగా డిజిటల్ బోధన కొనసాగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అప్పటి కలెక్టర్ శ్వేతామోహంతి సహకారంతో కేజీబీవీల్లో డిజిటల్ తరగతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేయాన్ సంస్థ వారు ఇన్‌బిల్ట్ ప్రొజెక్టర్లను అందజేశారు. తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే బోధనను ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికను ఉపయోగించి చూడడం, వినడం, అభ్యసించడం ద్వారా ఎక్కువ అంశాలు గుర్తుకు ఉండేలా విద్యార్థినులకు ఎంతగానో దోహదపడుతున్నది. సాంకేతిక విద్య ను తరగతి గదిలో అందిస్తూ విద్యార్థినుల నైపుణ్యాలను పెంపొందించేందుకు డిజిటల్ బోధన తోడ్పడుతుంది.
శ్రీరంగాపూర్‌కు కళాశాల మంజూరు..
ఈ ఏడాది నూతనంగా వనపర్తి జిల్లాకు శ్రీరంగాపురం కేజీబీవీ పాఠశాలను అప్‌గ్రేడ్ చేస్తూ నూతన కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మం జూరైన రెండు రోజులకే విద్యార్థినులు చేరడం గమనార్హం. బాలికల విద్యకు పాఠశాల నుంచి కళాశాల వరకు భద్రత, భరోసాను కల్పించే వ్యవస్థ కేజీబీవీలో నెలకొన్నది.
సీట్లు కావాలంటూ ఒత్తిడి..
పదేండ్ల కింద కేజీబీవీల్లో చేరేందుకు విద్యార్థుల కోసం వెతికేవారం. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయా యి. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు, డిజిటల్ తరగతులు, మెరుగైన బోధనతో ఫలితాల్లో సత్తాచాటుతున్నారు. అర్ఫన్, సెమీ ఆర్ఫన్, మైగ్రేడ్, సీడబ్ల్యూసీ పిల్లలకు మొదటి ప్రాధాన్యతగా సీట్లు ఇచ్చి మిగిలిన సీట్లను అన్ని కేటగిరీల వారిగా కేటాయించాం. – లోహితారెడ్డి, ఎస్వో, వనపర్తి కేజీబీవీ పాఠశాల
ప్రవేశాలకు పోటీ పెరిగింది..
కేజీబీవీల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇటీవల వెలువడిన ఫలితాల్లో విద్యార్థులు సత్తాచాటారు. దీంతో ప్రవేశాల కోసం పోటీ నెలకొన్నది. ఇప్పటికే ఉండాల్సిన సంఖ్యకు మించి అదనంగా విద్యార్థులను చేర్చుకున్నాం.
– సుబ్బలక్ష్మి, జీసీడీవో, వనపర్తి