నవాబ్‌పేట, జూన్ 24 : ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు సర్కారు చేర్యలు చేపడుతున్నా కొంత మంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నవాబ్‌పేట మండలంలోని కొల్లూరు ఉన్నత పాఠశాలలో సోమవారం సాయంత్రం 3గంటలకు స్టాఫ్ రూమ్‌లో నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో టేబుల్‌పైనే ఇద్దరు ఉపాధ్యాయులు నిద్రిస్తుండగా, మరో ఉపాధ్యాయుడు సెల్ఫోన్లో నిమగ్నమయ్యారు. మరో ఉపాధ్యాయుడు మాత్రం రికార్డు వర్క్ చేస్తూ కన్పించాడు.
అక్కడికి వెళ్లిన రిపోర్టర్లు ఫొటోలు తీసి సార్ అని పిలువగా, నెమ్మదిగా నిద్ర మత్తులో నుంచి తేరుకొని ఎవరు మీరు అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. లీజర్ పీరియడ్ ఉన్నందుకే నిద్రిస్తున్నామని తెలిపారు. కాగా, కొల్లూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పనితీరుపై కొంతకాలం నుంచి విమర్శలున్నాయి. 2022-23 విద్యాసంవత్సరంలో కొల్లూరు పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో జీరో ఫలితాలు వచ్చాయి. ఈ విషయమై జీహెచ్ఎం శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. తాను ఇటీవలే జీహెచ్ఎంగా పదోన్నతి పొంది ఇక్కడికి వచ్చానని, బదిలీల బిజీ ఉన్నందున ఎవ్వరినీ ఏం అనలేకపోతున్నామని చెప్పారు.