వడ్డేపల్లి : టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లో శనివారం టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల పూర్ణచంద్ర రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తిచేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. సినిమా రంగంలో ఎంతో బిజీగా ఉన్నా నందమూరి తారక రామారావు నాటి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీని స్థాపించారని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా ఎనలేని కీర్తి సాధించారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకి దక్కిందన్నారు.
ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెన్నిదిగా నిలిచారని చెప్పారు. మహిళలకు ఆస్తిలో వాటా, రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మండలాల ఏర్పాటు, ట్యాంకు బండ్‌పై విగ్రహాలు, హుస్సేన్‌సాగర్‌లో అతిపెద్ద బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ అభిమానులు కురువ కృష్ణన్న, సాయిచరణ్, చాణిక్య, భాస్కర్ రావు, పున్నారావు, కాట్రగడ్డ బోసు, తలశిల ప్రసాద్, రాజేంద్రప్రసాద్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.