గద్వాల, మార్చి 24 : గత కాంగ్రెస్ పాలకులు కమీషన్‌కు కక్కుర్తి పడ్డ కారణంగా ర్యాలంపాడు రిజర్వాయర్ పనులను గుత్తేదారు నాణ్యతతో చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రిజర్వాయర్ కట్టకు బుంగలు ఏర్పడి, సీపేజీ మరింత పెరుగుతున్నది. 4 టీఎంసీల నీరు నిల్వ చేయాల్సిన రిజర్వాయర్‌లో కేవలం 2 టీఎంసీలు మాత్ర మే నిల్వ చేస్తున్నారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందక అవస్థలు పడుతున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ కట్టకు బుంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రిజర్యాయర్ కరకట్ట ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టుల పర్యటన చేసినా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో పక్క నే రిజర్వాయర్‌లో నీరున్నా చివరి ఆయకట్టు రైతులకు అందకపోవడంతో ప్రతి ఏటా నిరాశకు గురవుతూనే ఉన్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ప్రజలకు తాగునీటితోపాటు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. అయి తే రెండు పంటలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో నిర్మించి ఈ రిజర్వాయర్ 1.12 లక్షల ఎకరాలకు వానకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగిలో సాగునీరు అందించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ర్యాలంపాడ్ రిజర్వాయర్‌కు పడ్డ బుంగలు పూడ్చడానికి కమిటీలు వేస్తున్నారు.. ఆ కమిటీల వల్ల కాలయాపన తప్పా బుంగలు పూడ్చడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2021లో రిటైర్డ్ ఇంజినీర్ల బృందం పర్యటన, లీకేజీలను నిలుపుదల చేయడం కోసం ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టడం, ఆ తర్వాత టెండర్ ద్వారా సాయిగణేశ్ కంపెనీకి అప్పజెప్పడం.. వారు రిపోర్టు సీడీవోకు పంపినా ఫలితం లేక పోవడం.. తదుపరి పుణె కమిటీ పరిశీలన చేసిన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వకపోవడంతో ఈ పనులు కమిటీల పేరుతో కాలయాపన జరుగుతున్నాయి. గతేడాది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ర్యాలంపాడు రిజర్వాయర్ పనులు పరిశీలించారు. నెట్టెంపాడ్ పెండింగ్ పనులతోపాటు ర్యాలంపాడ్ రిజర్వాయర్ మరమ్మతు పనులు పూర్తి చేస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగు పడడం లేదు. ప్రస్తుత ఈ వేసవి కాలంలో కూడా పనులు జరిగేలా కనిపించక పోవడంతో రాబోయే వానకాలం సీజన్లో కూడా రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటిని నింపే అవకాశం కనిపించడం లేదు.
ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతులపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వాయర్‌కు రిపేర్లు చేయాలా..? లేదా? అనే విషయాలపై సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్సీ)ను రిపోర్టు ఇవ్వాలని కోరింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీకి రూ.1.60 కోట్లు మంజూరు చేసింది. రిజర్వాయర్ రాక్‌టోల్ లేయర్ల మట్టి నమూనాల సేకరణ, డ్రిల్లింగ్ ఫిల్ ఆప్ మట్టి పరీక్షల పనుల కోసం రూ.1.20 కోట్లతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన సాయిగణేశ్ అసోసియేట్ పనులు దక్కించుకున్నది. ఆ కమిటీ మరో సారి పరిశీలన చేసి నివేదిక ఇచ్చా కే రిజర్వాయర్ పనులు మొదలయ్యే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం మార్చి నెల ముగుస్తుండడం.. జూన్ నుంచి వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగిలిన ఏప్రిల్, మే సమయంలో కమిటీ పరిశీలన చేసి రిపోర్టు ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అది ఈ రెండు నెలల్లో జరుగుతుందా? అనే అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఈ సీజన్లో కూడా ర్యాలంపాడ్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నింపే అవకాశాలు ఉండకపోవచ్చన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కమిటీ త్వరగా పరిశీలన చేసి నివేదిక ఇచ్చి మరమ్మతు పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
నెట్టెంపాడ్ లిఫ్ట్‌లో భాగంగా ధరూర్ మండలంలోని ర్యాలంపాడు గ్రామ సమీపంలో నిర్మించిన రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 4 టీఎంసీలు. కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణ సమయంలో నాణ్యతతో పనులు చేపట్టకపోవడంతో రిజర్వాయర్ సీపేజీ నీటి లీకేజీలు మొదలయ్యాయి. దీనిని 2019 లోనే గుర్తించారు. ఆ తర్వాత రెండేళ్ల అనంతరం 2021లో రిటైర్డ్ ఇంజినీర్ల బృందం రిజర్వాయర్‌ను పరిశీలించింది. పూర్తి స్థాయిలో నింపితే బండ్‌కు ప్రమాదమని చెప్పడంతో 4 టీఎంసీల నీటితో నింపాల్సిన రిజర్వాయర్‌ను 2 టీఎంసీలతోనే సరిపెట్టారు. ఇంజినీర్లు పరిశీలించిన వెళ్లిన తర్వాత లీకేజీలను గుర్తించడానికి సర్వే పనులను శ్రీసాయిగణేశ్ కంపెనీ టెండర్ పొందింది. ప్రతినిధులు రిజర్వాయర్‌ను పరిశీలించి బుంగలు పడ్డ, నీరు లీకేజీ అవుతున్న ప్రాంతాలను పరిశీలించి వాటిని ఎలా పూడ్చాలనే అంశాలపై నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను అధికారులు సెంట్రల్ డిజైన్ కార్యాలయానికి నివేదించినా మూలన పడేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పుణె కమిటీ రిజర్వాయర్‌ను పరిశీలించింది. ఈ కమిటీ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వకపోవడంతో ఈ ఏడాది కూడా రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నింపే అవకాశం లేకుండా పోయింది.