చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వం లాభాల బాట పట్టిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ కర్షకులు పండ్ల తోటలు సాగు చేసేలా చేయూత అందించనున్నది. ఇందుకోసం ఏడాదికి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు మంజూరు చేయనున్నది. ఉపాధి హామీ పథకం.. ఉద్యాన శాఖ సమన్వయంతో 13 రకాల తోటల సాగుకు పెట్టుబడులు ఇవ్వనున్నది. దీంతో ఉపాధి జాబ్ కార్డు కలిగి, ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులు లబ్ధిపొం దనున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపుగా 10 వేల ఎకరాల్లో తోటల సాగుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 31వ తేదీ నాటికి దరఖాస్తులను స్వీకరించనుండగా ఆగస్టు 15 నాటికి ప్రతిపాదనలు, నెలాఖరు నాటికి మొక్కలు నాటేలా పర్యవేక్షిం చనున్నారు. కాగా రైతులు సాగుచేసే తోటలను మూడేండ్లపాటు ప్రభుత్వమే పర్యవేక్షించనున్నది. దీంతో తోటల సాగు మరింత పెరుగనుండగా.. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్, (నమస్తే తెలంగాణ) /కొల్లాపూర్/వనపర్తి రూరల్/ అయిజ, జూలై 24
నాగర్‌కర్నూల్, (నమస్తే తెలంగాణ)/కొల్లాపూర్/వనపర్తి రూరల్/అయిజ, జూలై 24 : ఎస్సీ, ఎస్టీలతో పాటు చిన్న, సన్నకారు రైతులను పండ్ల తోటల సాగు దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన శాఖతో సమన్వయం చేసేలా ఆదేశించింది. ఫలితంగా ఆయా రైతులు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పండ్ల తోటలను సాగు చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం ఈనెలాఖరు వరకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించేలా ఆదేశించింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి, ఐదెకరాల్లోపు భూమి, బోరు లేదా బావితో కూడిన నీటి వసతి ఉన్న రైతులు ఈ పథకంతో లబ్ధిపొందే అవకాశం ఉన్నది. డ్రిప్ ఇరిగేషన్‌కు అవసరమయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తున్నది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఉద్యానశాఖ అధికారులు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు.
పండ్ల తోటల్లో అంతర పంటలు వేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు రెండు రకాల ఆదాయాన్ని అందించనున్నది. సంప్రదాయ పంటలతో నష్టపోయిన రైతులకు ఈ విధానం ఊరట కల్పించనున్నది. దీని ప్రకారం ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. రైతులు బతికించే ప్రతి మొక్కకూ మూడేండ్లపాటు నెలకు రూ.10 చొప్పున అందుతాయి. ఇక ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయడం, మొక్కలు నాటిస్తారు. లబ్ధిదారుడికి మట్టి నమూనా చార్జీలు చెల్లిస్తారు. మొక్కల ఎరువులకు మూడేండ్లకుగానూ డబ్బులు ఇస్తారు. ఒక్కో చెట్టుకు ఏడాదికి రూ.50 చొప్పున ఇస్తారు. ఇక లబ్ధిదారిడికి గరిష్ఠంగా ఐదు ఎకరాల వరకు మాత్రమే ఉండాలి. లబ్ధిదారులు మొక్కలను ప్రభుత్వ నర్సరీల్లో కానీ, రిజిష్టర్డ్ ప్రైవేట్ నర్సరీల నుంచే కొనుగోలు చేయాలి.
రైతులు సాగు చేసే పండ్ల తోటలను మూడేండ్ల వరకు ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. పండ్ల తోటల ప్రకారం.. మామిడికి రూ.30, బత్తాయికి రూ.44, నిమ్మ రూ.25, సపోట రూ.37, జీడిపప్పు రూ.24, సీతాఫలం రూ.26, ఆపిల్ బేర్ రూ.51, దానిమ్మ రూ.24, కొబ్బరి రూ.26, జామ రూ.31, మునగ రూ.15, అల్లనేరేడుకు రూ.25 చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది. ఇక ఎరువులకు ఒక్కో మొక్కకూ రూ.50, నిర్వహణ ఖర్చులకు రూ.10 చొప్పున చెల్లించనున్నది. అర్హులైన రైతులు ఉద్యానవన శాఖ, ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా దరఖాస్తులు చేసుకుంటే ఆగస్టు 15 వరకు అంచనాలు రూపొందించనున్నారు. వచ్చే నెల 15 నుంచి 31 వరకు మ్కొకలకు గుంతలు తీయడం, మొక్కలు నాటడం, అలాగే డ్రిప్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తారు. ఉపాధిహామీ కూలీలతో గుంతల తవ్వకం, మొక్కలు నాటే పనులు చేపట్టనున్నారు.
బిందు సేద్యానికి అధిక ప్రోత్సాహం కలగనున్నది. డ్రిప్ పరికరాల బిగింపునకు అయ్యే ఖర్చులూ చెల్లించనున్నారు. ఇందులో ఎస్సీ,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఉంటుంది. ఇలా ఉపాధి హామీ పథకంతో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుండడంతో పేద రైతులకు లబ్ధి చేకూరనున్నది. ఉమ్మడి జిల్లాలోని పలువురు రైతులు తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
* ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు
* ఐదు ఎకరాలలోపు ఉన్న పట్టాదారులు (మొత్తం కుటుంబసభ్యులది కలిపి)
* ఉపాధి జాబ్‌కార్డు కలిగిన వారు
* బోరు బావి కలిగి ఎలక్ట్రిసిటి ఉన్న రైతులు
* రైతు దరఖాస్తు పత్రం
* పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్
* బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్
* ఆధార్ కార్డు జిరాక్స్
* ఉపాధి హామీ జాబ్‌కార్డు జిరాక్స్
* పాస్ పోర్ట్ సైజ్ ఫొటోల (3)తో మీ జిరాక్స్‌లతో మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ/ఏఈవో/ఏపీవోను సంప్రదించాలి.
పండ్ల తోటలతో అధిక లాభాలు వస్తాయి. ఉపాధి హామీ, ఉద్యానశాఖలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు పరుస్తాయి. ఆసక్తి, అర్హతలు ఉన్న రైతులు ఈనెలాఖరులోపు ఫీల్డ్ అసిస్టెంట్లకు దరఖాస్తులు అందజేయాలి. జాబ్‌కార్డు కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. 13 రకాల పండ్ల తోటలను సాగు చేసుకోవచ్చు. ఈనెలాఖరులోపు రైతులను గుర్తించి, ఆగస్టు 15 వరకు ప్రతిపాదనలు తయారు చేస్తాం. ఆగస్టు చివరి నాటికి మొక్కలు నాటడం ప్రారంభమవుతుంది. ఇలా పండ్ల తోటల పెంపకంతో ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు మంజూరవుతాయి.
ఉపాధి హామీలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. మొక్కల కొనుగోలు నుంచి నాటడంతో పాటు నిర్వహణ ఖర్చులు మంజూరు చేస్తాం. జాబ్ కార్డు కలిగిన సన్న, చిన్నకారు, షెడ్యూల్ కులాలు, తెగల రైతులు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రజాప్రతినిధుల సహకారంతో లక్ష్యాలు చేరుకుంటాం. రైతులు లాభదాయకమైన పండ్ల తోటల సాగు చేపట్టాలి.
పండ్ల తోటలు, కూరగాయల తోటల పెంపకంపై ఆసక్తి కలిగిన రైతులకు ఈ పథకం చక్కటి అవకాశం. ఉపాధిహామీ పథకంతో పండ్ల తోటలు సాగు చేయాలనుకున్న వారు అధికారులను సంప్రదించాలి. అర్హులైన ప్రతి రైతునూ తోటలు, కూరగాయల సాగుకు ప్రోత్సహించేందుకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు ఆశించిన విధంగా లాభాలు పొందాలన్నదే ప్రభుత్వ సంకల్పం.