గండిడ్ జులై 01 : ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని గండీడ్ తాసీల్దార్ మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సల్కరిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. వంటశాలలో పరిశుభ్రత పాటించి నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలన్నారు. మెనూ ప్రకారం వడ్డించలేని వారిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపనట్లు తెలిపారు.
ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మండల విద్యాధికారికి లేదా తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం వానాకాలం నేపథ్యంలో అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావునా, కుళాయిల వద్ద పరిశుభ్రతను పాటించాలన్నారు. భోజనానికి ముందు ప్రతి విద్యార్థి చేత చేతులు, ప్లేట్స్ పరిశుభ్రంగా కడిగిన తర్వాతే భోజనాన్ని అందించాలన్నారు. భోజనం వడ్డించే ముందు పరిశుభ్రంగా చేతులు కడుక్కొని వారికి అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జనార్దన్ పాల్గొన్నారు.