బిజినేపల్లి, ఫిబ్రవరి 20 : నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు నిరసనకు దిగారు. వంట ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటలైనా వంట ఏజెన్సీ మహిళలు భోజనం వం డడం ప్రారంభించలేదు. దీంతో విద్యార్థులు ఆగ్రహంతో 8, 9, 10వ తరగతి విద్యార్థులు బయటకు వచ్చి పాఠశాల ఆవరణలో బైఠాయించారు.
భోజనం సక్రమంగా వండడం లేదని, సాయంత్రం స్నాక్స్ కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 398 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, భోజనం బాగా లేక కడుపు మాడ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు. విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకొన్న తాసీల్దార్ శ్రీరాములు, ఇన్చార్జి ఎంఈవో రఘునందన్శర్మ పాఠశాలకు చేరుకొని వారితో మాట్లాడారు.
కొన్ని రోజులుగా వంట చేసే వారి ప్రవర్తన సరిగ్గా లేదని, భోజనం రుచిగా వండడం లేదని వారి దృష్టికి తెచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపడా అందించడం లేదని, చాలీచాలనట్లుగా సరిపుచ్చుతున్నారన్నారు. వంట ఏజెన్సీ వెంటనే తొలగించి కొత్తవారికి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
గురువారం 11 గంటలు దాటినా ఇంకా వంట ప్రారంభించలేదని చెప్పారు. కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. అనంతరం ఏజెన్సీ మహిళలతో అధికారులు మా ట్లాడి భోజనం వండించారు. తర్వాత స్వయంగా అధికారులే విద్యార్థులకు భోజనం వడ్డించారు.