వెల్దండ, నవంబర్ 12 : ఉడికీ ఉడకని పురుగులు, రాళ్ల అన్నం, నీళ్ల చారు మాకొద్దని వెల్దండ బీసీ హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కారు. మంగళవారం వెల్దండ బీసీ బాలుర వసతిగృహం విద్యార్థులు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, కూరగాయాలు కూడా సక్రమంగా చేయడం లేదని, నీళ్ల చారు పోస్తున్నారని ఎలా తినాలని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని ఇదివరకే వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని, వంట నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం వల్ల వంటలు సరిచేయడం లేదని ఆరోపించారు. అదేవిధంగా హాస్టల్లో మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవని మరుగుదొడ్ల నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని, హాస్టల్ ఆవరణలో మురుగు నిలవడంతో దోమలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా హాస్టల్ గదులకు సరిగా డోర్లు, కిటికీలు కూడా లేక పోవడంతో రాత్రి వేళలో చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయడంతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న బీసీ వెల్ఫేర్ డివిజన్ అధికారి ఖాజానజీమ్అలీతోపాటు పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు సంతోష్‌తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.