మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ ( Mahabub Nagar ) జిల్లాలో గాలి,వాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేల కొరగగా ,అచ్చంపేటలో పిడుగుపాటుకు ( Lightning ) రెండు పశువులు మృతి చెందాయి. పాలమూరులో కలెక్టరేట్ వద్ద బస్ స్టాప్ షెడ్ గాలివానకు రోడ్డు మీద పడింది.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దాదాపు అరగంట పాటు ఈదురు గాలులతో వర్షం పడింది. బైపాస్‌లో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కార్లు ద్విచక్ర వాహనాలకు నష్టం వాటిల్లింది. వనపర్తి జిల్లాలో భారీగా ఈదురు గాలులు, గాలివాన, వడగళ్ల వర్షంతో వరికి నష్టం జరిగిందని రైతులు వాపోయారు.
పిడుగు పడి రెండు పశువులు మృతి
అచ్చంపేట రూరల్ : మండలంలోని బుడ్డ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గిరిజన రైతు మోత్యకు చెందిన రెండు పశువులు పిడుగు పడి మృతి చెందాయి. శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం సమయంలో వ్యవసాయ పొలంలో చెట్టుకు కట్టేసి ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి.
వ్యవసాయం కోసం ఇటీవలే రూ.1.10 లక్షల వ్యయంతో రెండు పశువులను కొనుగోలు చేసినట్లు రైతు తెలిపాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని కోరాడు.