స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారాయి. మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలో సిటీస్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, క్యాన్సర్ బాధితులకు 10 పడకలతో పాలియేటివ్ కేర్ సెంటర్, తలసేమియా, హిమోపోలియా, టీ హబ్ సెంటర్లను నెలకొల్పడంతో రోగులకు మెరుగైన సేవలందుతున్నాయి. సకల హంగులతో.. అత్యాధునిక టెక్నాలజీతో వందల కోట్లను ఖర్చుపెట్టి సరికొత్త పరికరాలను సమకూరుస్తున్నది. కార్పొరేట్‌ను తలదన్నేలా పలు విభాగాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు క్యూ కడుతున్నారు. దవాఖానలో రోజుకు 2 వేల మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. ప్రతి నెలా 900 నుంచి వెయ్యికి పైగా ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో పాలమూరు నిలిచింది.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 24 : ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. కార్పొరేట్‌ను స్థాయి వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక వసతులతో వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలో 700 పడకలకు పెరిగింది. రూ.5కోట్లతో అత్యాధునిక సిటీస్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, క్యాన్సర్ బాధితుల కోసం 10 పడకలతో పాలియేటీవ్ కేర్ సెంటర్, తలసేమియా, హిమోపోలియా, టీ హబ్ సెంటర్లను నెలకొల్పడంతో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.
సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్‌కు మెడికల్ కళాశాల మంజూరు చేసిన నాటి నుంచి వైద్య సేవలు మెరుగయ్యాయి. దీంట్లో భాగంగానే వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 2018 జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూ.480కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకొని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతోపాటు ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేశారు. జనరల్ దవాఖానలో కార్పొరేట్ హంగులు, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. ఇప్పటికే వైద్యులు, పరిపాలన విభాగం ఉద్యోగుల నియామాకం, పూర్తిస్థాయి సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది నియామాకాలు పూర్తయ్యాయి.
రోజుకు 2వేల వరకు ఓపీ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటేనే జనాలు జంకే పరిస్థితులు ఉండేవి. ప్రసవానికి వెళితే కాన్పు సరిగా అవుతుందో లేదోనని భయాందోళనకు గురై ప్రైవేటు దవాఖానలకు క్యూలు కట్టేవారు. దీంతో కార్పొరేట్ పేరిట ప్రైవేటు దవాఖానాలు వేలకు వేలు ఫీజులు వసూలు చేసేవి. అలాంటి పరిస్థితుల నుంచి స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ రూపురేఖలు మార్చేశారు. కేసీఆర్ కిట్టుతోపాటు పుట్టిన బిడ్డకు ప్రోత్సాహకంగా నగదు కూడా అందించడంతో సర్కారు దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో కాన్పులు చేస్తుండడంతో ప్రైవేటు దవాఖానలు మూతబడే పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలో రోజుకు 1,600 నుంచి 2వేలు మంది రోగులు వస్తుండడంతో గతానికి పోల్చి చూస్తే మూడు రెట్లు ఓపీ పెరిగింది. ఈ ఏడాది ప్రతి నెలా 900 నుంచి 1,000కి పైగా ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో పాలమూరును నిలిపారు వైద్యులు. దీంతోపాటు సాధరణ కాన్పులు కూడా ఎక్కువగా చేస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 కాన్పుల్లో 25 వరకు సాధరణ కాన్పులు ఉండడం విశేషం. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కింద జిల్లాకు ప్రభుత్వం వెల్నెస్ సెంటర్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఎంతోమంది ఉద్యోగులు, జర్నలిస్టులు, ఈ వెల్నెస్ సెంటర్ సేవలందిస్తోంది.
వైద్యసేవలు మెరుగయ్యాయి..
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సేవలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. దీంతో రోగులకు సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. నిరంతరం అందుబాటులో వైద్యులు, సిబ్బంది ఉండడంతోపాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు ఓపీ 2వేల వరకు నమోదవుతున్నది. ప్రభుత్వ సహకారంతో మరింత మెరుగైన సేవలు అందిస్తాం.
– డాక్టర్ జీవన్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన, సూపరింటెండెంట్