వనపర్తి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. క్షయ రహిత సమాజాన్ని నిర్మూలించడంలో వనపర్తి జిల్లా యం త్రాం గం కృషి అభినందనీయమన్నారు. మంగళవారం సాయంత్రం వనపర్తి కలెక్టరేట్ సముదాయానికి చేరుకున్న గవర్నర్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు,అధికారులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, వివిధ రంగాల ప్రముఖులు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా ప్రోఫైల్తోపాటు జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. వివిధ రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులు గవర్నర్‌తో ముఖాముఖి పరిచయ కార్యక్రమంలో పాల్గొని వారి ప్రతిభను వివరించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, గవర్నర్ స్పెషల్ సెక్రటరి భవాని శంకర్, ఎస్పీ సునీతారెడ్డి,అదనపు కలెక్టర్లు కీమ్యా నాయక్, యాదయ్య పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
గద్వాల, డిసెంబర్ 23 : జోగుళాంబ గద్వాల జిల్లా కవులు, కళాకారుల జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై మాట్లాడారు. అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి అవసరమైన స హకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. అం తకు ముందు జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక వివరాలు, చరిత్ర, ప్రసిద్ధ ఆలయాలు, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి,వివిధ శాఖల సంక్షేమ పథకాల అమలు గురించి గవర్నర్‌కు వివరించారు. అనంతరం గవర్నర్‌కు గద్వాల చేనేత పట్టు చీర ఫ్రేమ్‌ను జ్ఞాపికగా అందజేశారు. మెప్మా, సెర్ఫ్ ,మ హిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అ నంతరం కలెక్టరేట్లో గవర్నర్ మొక్క నాటారు.
జోగుళాంబ సన్నిధిలో గవర్నర్
అలంపూర్,డిసెంబర్ 23 : ఐదో శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో పరమేశ్వరుడి అభిషేకం, జోగుళాంబ ఆలయంలో కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు విజయుడు, కృష్ణమోన్రెడ్డి, కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానిశంకర్, గవర్నర్ డీసీ మేజర్ అమన్ కుందూ, గవర్నర్ ఏడీసీ కాంతి లాల్ పటేల్, గవర్నర్ సీఎస్‌వో శ్రీనివాసరావు, గవర్నర్ వ్యక్తి గత కార్యదర్శి పవన్‌సింగ్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో నర్సింగరావు, ఆర్డీవో అలివేలు,డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, డీఎస్పీ మొగులయ్య, పురావస్తు శాఖ ఇంజినీర్ కిశోర్ కుమార్ రెడ్డి, అలంపూర్ ఆలయ ఈవో దీప్తి పాల్గొన్నారు.