శ్రీశైలం, జూలై 8 : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. మంగళవారం శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారే సమర్పించి జలహారతి ఇచ్చి నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి మంగళవారం సాయంత్రానికి 2,13,824 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. ప్రాజెక్టులోని నాలుగు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,06,792 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అదేవిధంగా కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 65,719 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
అయిజ, జూలై 8 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాం 16 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 45,280 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. మంగళవారం టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 52,766 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 49,334 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 75.930 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1624.83 అడుగులు ఉన్నది. టీబీ డ్యాం గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 58,358 క్యూసెక్కులు ఉండగా, ప్రధాన కాల్వకు 595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 57,763 క్యూసెక్కులు చేరుతున్నాయి.
గద్వాల, జూలై 8 : ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. జూరాలకు సోమవారం ఇన్‌ఫ్లో 1,25,000 క్యూసెక్కుల వరద రాగా 14 గేట్లు ఎత్తి దిగువకు 94,962 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 29,053 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా భీమా లిఫ్ట్-1కు 1300, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల ప్రధాన ఎడమ కాల్వకు 770, కుడి కాలువకు 400, ఆర్డీఎస్ లింక్‌కు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు అవుట్ ఫ్లో 1,26,844 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.952టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.