నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం శ్రీపురంలో వెలసిన శ్రీ రంగనాయక స్వామి(Sripuram Ranganayaka Swamy) ఆలయం శుక్రవారం గోవింద నామ స్మరణతో మారుమోగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam) భాగంగా రంగనాథస్వామి తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఉదయం స్వామివారి ఎదుర్కోలు, పల్లకీసేవ, కల్యాణం కనుల పండుగగా జరిగింది.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు కల్యాణోత్సవం తిలకిచ్చేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా భక్తులు కోలాటాలు, నృత్యాలతో ఉత్సాహపరిచారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం మాడవీధుల్లో రథోత్సవం శోభాయమానంగా జరిగింది. గోవిందా అంటూ శ్రీరంగనాథస్వామి రథాన్ని భక్తులు లాగుతూ ఆనంద పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆలయ ధర్మకర్త రంగాచార్యులు కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.