మహబూబ్‌నగర్, ఏప్రిల్ 16 : క్వారీలో పడి ముగ్గురు యువకులు చనిపోతే కనీసం వారి కుటుంబాలను పరామర్శించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపులేన్నట్లు వ్యవహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసహనం వ్యక్తం చేశా రు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో క్వారీలో పడి మృతిచెందిన ముగ్గురు యువకుల మృతదేహాలను పరిశీలించి దివిటిపల్లిలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు క్వారీలో పడి ముగ్గురు యువకులు చనిపోతే కలెక్టర్, ఎస్పీ, అధికారులు ఏం జరిగింది, వారి కుటుంబాల పరిస్థితి ఏ మిటనే మానవత్వం లేకుండా నిర్లక్ష్యం చేయడం బా ధాకరమన్నారు. ప్రమాదమని తెలిసి క్వారీ చుట్టూ ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం సరికాదన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ సర్కారులో చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అయినప్పటికీ అధికారులు కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
అధికారులు పర్యటించాలంటే మరెవరి నుంచైనా అనుమతి తీసుకోవాలని అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాలను పరామర్శించి వారిని ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే వెంటనే క్వారీని పూడ్చివేయాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, దేవేందర్‌రెడ్డి, శివరాజ్, రాఘవేందర్‌గౌడ్, అంబదాస్, శివ తదితరులు పాల్గొన్నారు.