మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 1 : అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బాకీ కార్డులను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ఉద్య మం ప్రారంభించిందని తెలిపారు. అభయహస్తం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారి అబద్ధపు హామీలను అందరికీ గుర్తు చేసేందుకే బాకీ కార్డు ఉద్యమాన్ని చేపట్టామన్నారు.
ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టేందుకు సిద్ధమైందని త్వరలోనే కరెంట్ చార్జీలు కూడా పెంచబోతున్నారన్నారు. రైతులకు యూరియా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం పండించిన పంట కొనుగోలు చేసేందుకు కూడా అవసరమైన ఏర్పా ట్లు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయ డం వల్ల ఎవరికి లాభం కలిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. రానున్న ఎన్నికల్లోనైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రతి మహిళకు గృహలక్ష్మి పథకం కింద రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ.55 వేలు ప్రభుత్వం బాకీ పడ్డిందన్నారు. వృద్ధాప్య పింఛన్లను రూ. 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 22 నెలల కాలంలో ప్రతి వృద్ధుడికి రూ.44 వేలు బాకీ పడిందన్నారు. దివ్యాంగుల పింఛన్‌ను ఆరు వేలకు పెంచుతామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.44వేలు ప్రతి దివ్యాంగుడికి బాకీ పడిందన్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకానికి తులం బంగారం అదనంగా ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ లక్షాలది మంది ఆడ పడుచులకు బంగారం బాకీ పడిందన్నారు.
రైతు భరోసా కింద ప్రతి రైతుకూ రూ.76 వేల బాకీ పడిందన్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి రూ.88 వేలు బాకీ పడిందన్నారు. దీంతోపాటు విద్యార్థులను స్కూటీ, విద్యా భరోసా కార్డు కింద రూ.50వేలు బాకీ పడిందన్నారు. వీటిని ఎప్పుడు చెల్లిస్తారని ఎన్నికల్లో ఓట్లు అడేగేందుకు వచ్చే నాయకులకు ప్రజలు నిలదీయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ ముడా చైర్మన్ వెంకన్న, మాజీ ఎంపీపీ బాలరాజు, నరేందర్, దేవెంర్రెడ్డి, శివరాజ్, నర్సింహారెడ్డి, లక్ష్మయ్య, శ్రీకాంత్‌గౌడ్, నవకాంత్, వేదావత్, చెన్నయ్య, జంబులయ్య తదితరులు పాల్గొన్నారు.