దేవరకద్ర, మార్చి 29: మండలంలోని లక్ష్మీపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తెలుగు సంవత్సర శ్రీవిశ్వావసు నామ ఉగాది వేడుకలను విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక, జెడ్పీహెచ్ఎస్ ఆవరణల్లో సరస్వతి దేవి చిత్రపటానికి ఉపాధ్యాయులు జ్యోతిప్రజ్వలన చేసి, పూల మాలలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ రెడ్‌క్రాస్ సమన్వయకర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ ఉగాది పండుగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు శ్రీనివాస్, కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, మార్చి 29: మండలంలోని ముడుమాల ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం శేఖర్ ఆధ్యర్యంలో ఉగాది మందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉగాది వైభవం, పంచాంగం, పచ్చడి, సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించి, షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిని విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులందరూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకొని ఉగాది పచ్చడి సేవించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
అనంతరం పాఠశాలలో అమలవుతున్న ఏఐ పైలెట్ ప్రాజెక్ట్, మధ్యాహ్న భోజనం, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సామర్థ్యాలు రాబోయే విద్యా సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలు తదితర వాటిపై చర్చించి సూచనలు, సలహాలు స్వీకరించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ జయమ్మ, ఉపాధ్యాయులు భారతి, రవికుమార్, జ్యోతి, పద్మావతమ్మ, వలంటీర్ నిజగుణశివయోగి, సర్వీస్ పర్సన్ సోఫి, శివమ్మ, మధ్యాహ్న భోజన సిబ్బింది తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, మార్చి 29: పట్టణంలోని హంస వాహిని ఉన్నత పాఠశాల, సాయి స్కూల్లో శనివారం ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కొత్త మట్టి కుండలో షడ్రుచులతో పచ్చడి తయారు చేసి వితరణ చేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 29: జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సాయంత్రం శ్రీవిశ్వావసు నామ ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేఎస్.రవికుమార్ ఆధ్వర్యంలో గణనాథుడు, సరస్వతీ దేవి విగ్రహాలకు విద్యార్థులు, అధ్యాపకులు, ముఖ్య అతిథులు పూజా కార్యక్రమాలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం గొండాల్య రాఘవేంద్రశర్మచే పంచాగ శ్రవణం వినిపించారు. చైర్మన్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలో విద్యార్థులు అన్నిరంగాల్లో విజయాలు సాధించాలని కోరారు. ప్రాంగణ ఎంపికల్లో 206మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో కళాశాల కార్యదర్శి వెంకటరామారావు, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, అకాడమిక్ డైరెక్టర్ సుజీవన్‌కుమార్, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలానగర్ (రాజాపూర్), మార్చి 29: మండలంలోని ఈద్గానిపల్లి పాఠశాలలో విద్యార్థులు శనివారం ముందస్తుగానే ఉగాది పచ్చడిని రుచి చూశారు. ఆదివారం ఉగాది పండుగ కాగా.. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు ప్రవీణ్‌కుమార్ శనివారం పాఠశాలలో విద్యార్థులకు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. పచ్చడిని తయారు చేసి విద్యార్థులకు రుచి చూపించారు.