శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనుల పండువగా నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిర్సనగండ్ల, గద్వాల జిల్లాలోని బీచుపల్లి, మహబూబ్‌నగర్‌లోని రామాలయంలో వేదమంత్రాలతో అర్చకులు కల్యాణ తంతు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకించారు.
ఈ సందర్భంగా వనపర్తిలోని సాయినగర్ కాలనీ రామాలయంలో కల్యాణోత్సవానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లోని కూకట్పల్లి బాలాజీనగర్ కాలనీలోని కనకదుర్గ ఆలయంలో, పాలమూరు జిల్లా కేంద్రంలో, హన్వాడ మం డలంలోని రామాలయాల్లో కల్యాణ వేడుకను తిలకించి పూజలు నిర్వహించారు. ఉండవల్లి మండలం పుల్లూరులో సీతారాముల కల్యాణ మహోత్సవంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 6