కల్వకుర్తి రూరల్, మే 21 : నిత్యం తాటిచెట్లు ఎక్కి కల్లును గీస్తూ జీవనం పోసుకునే గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్త్తున్నది. ఇప్పటికే కులవృత్తులతో ఉపాధి పొందుతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. ఈక్రమంలో కేసీఆర్ సర్కారు గీత కార్మికులకు బీమాను అందించేందుకు శ్రీకారం చుట్టింది. గతంలో గీత కార్మికులు చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడితే ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా సకాలంలో అందక ఆ కుటుంబం రోడ్డున పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ విధానానికి స్వస్తి పలికి ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడిన కార్మికుడికి వేగంగా ఎక్స్‌గ్రేషియా అందేలా ప్రభుత్వం విధివిధానాల తయారీకి కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రప్రభుత్వం గీత కార్మికులకు అండగా ఉండేందుకు 50ఏండ్లు నిండిన గీత కార్మికులకు రూ.2,016 పింఛన్ అందిస్తూ ఆసరాగా నిలుస్త్తున్నది. గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియాను రూ.ఐదు లక్షలకు పెంచడంతోపాటు వారికి మోపెడ్బైక్లను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గీత కార్మికులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.
రైతు బీమా తరహాలో..
గీత కార్మికులు చెట్ల నుంచి కల్లు గీయడానికి రోజుకు మూడుసార్లు చెట్టు ఎక్కి దిగుతారు. ఈనేపథ్యంలో వారు చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందితే ఆ కుటుంబాని ఆదుకునేందుకు ప్రభుత్వం బీమా పథకాన్ని అమలుచేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. గతంలో ఎక్స్‌గ్రేషియా రూ.రెండులక్షలు ఉన్నప్పటికీ బాధిత కుటుంబానికి అందించడంలో ఆలస్యమయ్యేది. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షలకు పెంచి రైతుబీమా తరహాలో పదిరోజుల్లోనే అందించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. గీత, గౌడ సామాజిక వర్గాలకు ఆర్థిక సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గీత సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థతోపాటు ఎక్సైజ్ శాఖ సమన్వయంతో గీత కార్మికులకు బీమా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో 15శాతం రిజర్వేషన్ కేటాయించి వారి ఉన్నతికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. కల్వకుర్తి మండలంలో 116 మంది గీత కార్మికులు పింఛన్ పొందుతున్నారు. కల్వకుర్తి డివిజన్లోని మండలాల్లో 22 సొసైటీల్లో 725మంది సభ్యులుండగా 450మందికి లైసెన్స్ కలిగి ఉన్నారు. ప్రభుత్వం నుంచి బీమాకు సంబంధించిన విధివిధానాలు అందగానే అర్హులకు పథకాన్ని వర్తింపజేస్తామని కల్వకుర్తి ఎక్సైజ్‌శాఖ సీఐ శంకర్ తెలిపారు.
Mahabubnagar3
బీమా కల్పించడం సంతోషం..
ప్రభుత్వం గీత కార్మికులకు బీమా కల్పించడం చాలా సంతోషం. ఇంతవరకు కార్మికులు ప్రమాదంలో చెట్టు మీద నుంచి పడితే వారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా పొందేందుకు చాలా ఇబ్బంది పడేవారు. బీమాతో గీత కార్మికులకు ధీమా కల్పించారు. సీఎం కేసీఆర్‌కు గీత కార్మికులు రుణపడి ఉంటారు.
– చంద్రయ్యగౌడ్, గీత కార్మికుడు, తర్నికల్
కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు
రైతుల మాదిరిగా గీత కార్మికులకు బీమా సదుపాయం కల్పించడం హర్షణీయమైన విషయం. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి మొత్తాన్ని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచడంతో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్లయ్యింది. సీఎం కేసీఆర్ సారుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– భాస్కర్‌గౌడ్, గీత కార్మికుడు, తర్నికల్