మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి ( Collector Vijayendira Boi ) సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కోయిల్ కొండ మండలం చంద్రాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని, భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గర్భిణుల నమోదు , ప్రసవాల వివరాలను వైద్య సిబ్బందిని అడిగారు. గర్భిణులు, మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రక్త హీనత ఉన్న మహిళలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచి చికిత్స అందించాలని అన్నారు. చిన్నపిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
ఈ నెల 20 వరకు భూసమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనేలా అవగాహన కలిగించాలని అన్నారు. వచ్చిన దరఖాస్తులు నిర్దేశిత గడువు లోగా పరిష్కారం చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో పాటు తహసీల్దార్,రెవెన్యూ, వైద్య సిబ్బంది ఉన్నారు.