Nagarkurnool | వెల్దండ, ఏప్రిల్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం ఆదిలోనే అభాసుపాలైంది. రేషన్ షాపులో సన్న బియ్యం సంచిలో దొడ్డు బియ్యం ప్రత్యక్షం కావడం రేషన్ లబ్ధిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని రేషన్ షాప్ నెంబర్ – 2లో మొదటిరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తుండగా సన్న బియ్యం సంచిలో దొడ్డు బియ్యం రావడంతో అవి లబ్ధిదారుడు చిమ్ముల రవీందర్ రెడ్డి సంచిలో పోయగా అతను అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరిగి సన్న బియ్యం పోయించుకొని వెళ్ళాడు. దీంతో రేషన్ డీలర్ శ్రీనివాస్ దొడ్డు బియ్యం సంచిని పక్కకు పెట్టి అధికారులకు సమాచారం అందజేశారు. దొడ్డు బియ్యం ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ అధికారులు తిరిగి సన్న బియ్యం సంచిలో దొడ్డు బియ్యం పంపితే ఎలా పంపిణీ చేయాలంటూ రేషన్ డీలర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరిగితే లబ్ధిదారులచే తమకు చాలా ఇబ్బంది ఉంటుందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కోరుతున్నారు.