Son Murder | హైదరాబాద్ : నవమాసాలు కని పెంచిన తల్లి పట్ల ఓ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి తన కుమారుడిని కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ సమీపంలో నాగయ్య అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే కుమారుడు శ్రీధర్(30) మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవిస్తూ తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
కుమారుడి ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తండ్రి.. తాగుబోతు కుమారుడిపై కర్రతో దాడి చేశాడు. చివరకు కుమారుడు ప్రాణాలొదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.