గద్వాల అర్బన్, డిసెంబర్ 13 : జోగుళాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. ఏ గుట్ట కనిపించినా రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతున్నది. అధికారులకు నెలవారిగా మామూళ్లు ముట్టజెప్పుతుండడంతో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినబడుతున్నా యి. శుక్రవారం గద్వాల మండలం అనంతపు రం సమీపంలో అధికార పార్టీకి చెందిన ఓ రా జకీయ నాయకుడు అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమచారం మేరకు.. మైన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి మట్టిని తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేసి జరిమానా విధించారు.
అయితే ఘటనా స్థలంలో ఇంకా మట్టి టిప్పర్లు ఉండగా, వాటిని పట్టుకోకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో ఓ కీలక నాయకుడి ఒత్తిడితో అధికారులు ఒక టిప్పర్ను పట్టుకొని జరిమానా విధించి మిగతా వాటిని వదిలేసినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. అధికార పార్టీలో మట్టి తరలించే మాఫియా గ్రూప్లుగా డజన్ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఏ గుట్ట కనపడినా వారం తిరిగి చూసేసరికి మాయం చేస్తున్నా రు. అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, వీరిని పట్టుకోకుండా ఉండేందుకు అధికార పార్టీలో ఓ నాయకుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మట్టిని తరలించే వారిపై ఎలాంటి చ ర్యలు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి తెస్తూ అధికారులకు నెలవారిగా మాముళ్లు ఫిక్స్ చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
మైన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సం యుక్తంగా తనిఖీలు చేసి టిప్పర్ను పట్టుకు న్నాం. టిప్పర్ యాజమాని సుబ్బరావుకు 10 వేల జరిమానా విధించాం. అధికారులు పట్టించుకోవడం లేదనేది అవాస్తవం. అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-వెంకటరమణ, జిల్లా మైనింగ్ శాఖ అధికారి