మహబూబ్‌నగర్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా దోమల పెంట ఘటనలో మృతదేహాల వెలికితీతకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. శనివారం తెల్లవారుజామునే అంతా అయిపోతుందని భావించిన అధికార యంత్రాంగానికి జీరో పాయింట్ వద్ద ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం..ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేస్తున్నా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.
అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. పేరుకుపోయిన బురదను తొలగించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 15ఫీట్ల మేరకు మేట వేసిన బురదను తొలగిస్త్తుంటే.. మళ్లీ బురద చేరుకుంటుంది. చేసిన కష్టమంతా వృథాగా మారుతుంది. ఇదిలా ఉండగా సొరంగంలో జీరో పాయింట్ వద్ద ఇక మిషనరీతో బురద బయటకు తీసి ఆప్రదేశాన్ని జల్లెడ పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మృతదేహాలు అక్కడే ఉండడంతో ఆదివారం సాయంత్రానికి ఆపరేషన్ పూర్తవుతుందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయిన 8 మందిని వెలికి తీసేందుకు టన్నెల్లో ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. 12వ కిలోమీటర్ల వద్ద టీబీఎంపై భాగంలో నలుగురు, కింది భాగంలో మరో నలుగురు చిక్కుకొని మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడ చిక్కుకున్న ప్రదే శం వద్ద సుమారు 15 అడుగుల మేర బురద నిండుకుపోయింది. అయితే బురదలో 3 నుంచి 4 మీటర్ల కింద, మిష న్ కింది భాగంలో మిగతా మృతదేహాలు ఉంటాయని అంచనాకు అధికారులు వచ్చారు.
శనివారం అర్ధరాత్రి ఈ ప్రాంతానికి రెస్క్యూ బృందం చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. డెడ్‌బాడీలు దొరికే అవకాశం ఉండడంతో అంబులెన్స్‌లను అర్ధరాత్రి సిద్ధం చేసి ఉంచారు. నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం కోసం రాత్రికి రాత్రే వైద్యులను రప్పించారు. అయితే ఇక్కడ ప్రతికూల పరిస్థితులు వెంటాడాయి. పై భాగంలో తవ్వుతున్న కొద్దీ కింది భాగం నుంచి ఊట వస్తోంది. అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా మళ్లీ చేరుతున్న నీరు, బురదతో రెస్క్యూ బృందాలు వెనక్కిమళ్లాయి.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 12వ కిలోమీటర్ వద్ద పేరుకుపోయిన బురదను తొలగించడం రెస్క్యూ బృందాలకు సవాల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి.. ఆక్సిజన్ లెవల్ తక్కువగా ఉన్నా అక్కడ చిక్కిన మృతదేహాలను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా అక్కడ బురదను తొలగించడం కష్టంగా మారింది. తెల్లవారు జామునుంచి లోపలికి వెళ్లిన వారికి ఫలితం కనిపించలేదు. దీంతో మిషనరీ ద్వారా బయటికి తీయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికోసం భారీ హిటాచీని తీసుకొచ్చారు. బురద తీయడానికి వెళ్లిన రెస్క్యూ బృందానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి పైకి వెళ్లి బురదను తొలగిస్తుంటే మళ్లీ బురద పేరుకుపోతుంది. దీంతో అక్కడ మనుషులు పనులు చేయడం ప్రమాదకరమని గుర్తించారు.
ఎన్జీఆర్ఐ ఇచ్చిన నివేదికతో ఇక టన్నెల్లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తామని చెప్పి హంగామా చేసిన అధికారులు శనివారం సైలెంట్ అయిపోయారు. పరిస్థితి అంచనా వేయడంలో విఫలం కావడంతో మృతదేహాల అన్వేషణ ముందుకుసాగుతోంది.. ఈరోజు ఎలాగైనా ముగింపు పలకాలని అధికారులు రెస్క్యూ టీంలు భావిస్తున్నాయి. మొత్తంపైన మృతదేహాల అన్వేషణ సవాల్‌గా మారింది.
సొరంగంలో 13.5 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ విరిగి అడ్డంగా పడింది. దీంతో దీనిని మూడు రోజులుగా కట్‌చేసి ముక్కలుముక్కలుగా చేస్తున్నారు. అయినా ఒక కొలిక్కి రావడం లేదు. ఒక బృందం మిషన్ కట్ చేస్తుంటే మరికొన్ని టీంలు పేరుకుపోయిన బురదను తొలగించే ప్రయ త్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటికి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు డీవాటర్ చేస్తున్న ని మిషానికి 6 వేల నుంచి 8 వేల లీటర్ల నీరు బయటకు వస్తుంది. ఇది కూడా సహాయక చర్యలకు పూర్తి అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు.
బీజేపీ లెజిస్లేటర్ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8 మంది ప్రతినిధి బృందం ఎస్ఎల్బీసీని పరిశీలించింది. వీరిని ప్రభుత్వం రాచమర్యాదలతో లోపలికి పంపించారు. మూడ్రోజుల కిందట వచ్చిన బీఆర్ఎస్ నేతలను ఆంక్షలు విధించగా.. కమలం పార్టీ నేతలకు మాత్రం రెడ్ కార్పెట్ వేసింది.