జడ్చర్ల, అక్టోబర్ 16 : రాష్ట్రంలో సంపద పెంచి.. అన్ని వర్గాల ప్రజలందరికీ పంచాలన్నదే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారెంటీ’లు గాలిలో కలిసాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన త రువాత అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నామన్నారు.
మ్యానిఫెస్టోలో లేని వాటిని కూడా పేదల సంతోషం కోసం ఎన్నో రకాల స్కీంల ను ప్రవేశపెట్టామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను ఏనాడూ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదన్నారు. తమ పథకాలను కాపీ కొట్టారని మాట్లాడుతున్నారని, కానీ వారు బీఆర్ఎస్ పథకాలనే మార్చి ప్రకటించారన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించాలని ముందుకు రావడంతో చా లా గొప్ప నిర్ణయమన్నారు. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదన్నారు.
ఏ కారణంచేత మరణించినా రూ.5లక్షల బీమా అందజేయనున్నామన్నారు. అర్హులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. పనిచేసే ప్రభుత్వానికి, నాయకులకు ప్రజలు అండగా నిలబడాలని కోరారు. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తు న్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ముడా డైరెక్టర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మురళి, లక్ష్మయ్య, శ్రీకాంత్, దేవ, మఫియోద్దీన్ పాల్గొన్నారు.