మహబూబ్‌నగర్, డిసెంబర్ 26 : నూతన కోర్టు భవన నిర్మాణంతో న్యాయవ్యవస్థకు మరింత గౌరవం అందుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి సమీపంలో నూతన కోర్టు భవన నిర్మాణానికిగానూ పదెకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని హంగులతో భవనాన్ని నిర్మిస్తామన్నారు. పదెకరాల్లో 16 కోర్టులను నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. జడ్జీలు, న్యాయవాదులు ఇప్పుడున్న భవనాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పదెకరాలు కేటాయించినట్లు చెప్పారు.
బైపాస్, మహబూబ్‌నగర్ పట్టణానికి వెళ్లే మరో రహదారి.., మహబూబ్‌నగర్-రాయిచూర్ వెళ్లే ఇంకో రహదారితో నూతన భవనానికి కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. దీంతో న్యాయవాదులు, జడ్జీలు, ట్రేడర్స్, బార్ అసోసియేషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి నూతన కలెక్టరేట్‌కు కేవలం ఐదు నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. పశుసంవర్ధక పాలిటెక్నిక్‌కు ఇబ్బంది కలగకుండా అదనపు స్థలాన్ని కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, సీనియర్ అడ్వకేట్ ప్రతాప్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్దన్, స్వదేశీకుమార్, ప్రభుత్వ ప్లీడర్ మనోహర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీకృష్ణ, సీనియర్ అడ్వకేట్లు హనుమంతు, ఉమామహేశ్వరి, శశిధర్, రవీందర్‌నాయక్, లైబ్రరీ కార్యదర్శి నర్సింహులు, సొసైటీ అధ్యక్షుడు రవిప్రకాశ్, కౌన్సిలర్ గిరిధర్‌గౌడ్, శ్రీనివాసులు, కరుణాకర్, రాజగోపాల్, ఆర్ఐ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్లో రాణించాలి..
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 26 : క్రీడాకారులు క్రికెట్లో రాణించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆకాంక్షించారు. మహబూబ్‌నగర్‌లోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ఎదురుగా ఉన్న తిరుమల హిల్స్‌లో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాక్స్ క్రికెట్‌ను హైదరాబాద్, బెంగళూర్ వంటి మహానగరాల్లోనే ఆడుతారని, మహబూబ్‌నగర్‌లో అందుబాటులోకి రావడం అభినందనీయన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.