కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం( Singotam ) గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి( Lakshminarasimha Swamy) బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) గురువారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి.ఈనెల 21 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. మొదటి రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా గణపతి పూజతో వాస్తు పూజ, హోమం స్వామి వారికి అభిషేక కార్యక్రమాలను వేద పండితులు ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ ఓరుగంటి సతీష్ కుమార్ శర్మల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణాల మధ్య ఘనంగా నిర్వహించారు.
శివ కేశవ రూపంలో లక్ష్మీనరసింహుడు
నాటి సింగపట్నం నేటి సింగోటంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుండటం ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శైవం, వైష్ణం మిళితమై పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సుమారు 13, 14వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది.

జటప్రోల్ సంస్థాన పాలన కాలంలోని క్రీ.శ 1795 ఆలయం నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. స్థల పురాణం ప్రకారం సురభి రాజుల పాలనలో ప్రస్తుత ఆలయ గర్భగుడి ఉన్న ప్రదేశంలో ఒక రైతు పొలం దున్నుతుండగా నాగలికి ఒక నల్ల రాయి తగిలింది. తగిలిన ఆ నల్ల రాయిని తీసి పక్కన వేసి పొలం దున్నడం ప్రారంభించాడు.
మళ్లీ మరుసటి రోజు కూడా అదే ప్రదేశంలో నల్ల రాయి అక్కడే ఉండడంతో మళ్లీ తీసి పక్కన వేసి ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న సమయంలో నరసింహస్వామి ఆ రైతు స్వప్నంలోకి వచ్చి స్వయానా తాను శ్రీ లక్ష్మీనరసింహస్వామి అవతారం అని చెప్పినట్లు పురాణ గాథలు తెలుపుతున్నాయి. అదే రాత్రి సురభిరాజు అయిన సింగమ నాయుడు నరసింగ భూపాలుడుకు స్వప్నంలో లక్ష్మి నరసింహ స్వామి వచ్చి తెల్లవారుజాములో ఆలయ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
రాజుతో పాటు అదే రాత్రి అగ్రహారంలోని ఓరుగంటి నరసయ్య దీక్షితులుకు కూడా స్వప్నంలో స్వామి వారు కనిపించి ముహూర్తం దాటేలోపు తనను ప్రతిష్టించాలని కోరడంతో రైతుతో పాటు సురభి రాజు సింగమ నాయుడు ,అగ్రహార వేద బ్రాహ్మణుడు ఓరుగంటి నరసయ్యదీక్షితులు స్వయంభుగా వెలసిన ప్రదేశంలో అప్పటికప్పుడు పొలంలో దొరికిన నాపరాయితో లింగాకారంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహానికి గర్భగుడి నిర్మించినట్లు పురాణ గాథల ద్వారా తెలుస్తుంది.
ఇప్పటికి కూడా గర్భగుడిలో మరో గర్భగుడి ఉండటాన్ని గమనించవచ్చు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల భక్తులతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.