వనపర్తి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు ప్రత్యేక కాల్వను ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ముందుకు సాగడం లేదు. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా దాదాపు ఏడేండ్లుగా ఈ కెనాల్ ప్రతిపాదన ఆటకెక్కింది. ఈ కాల్వ ఏర్పాటు చేయనందున ప్రతిఏటా జూరాల ఎడమ కాల్వపై ఆధారపడ్డ చివరి మండలాల రైతుల పంటలకు సరిపడా నీరందక నష్టపోతున్నారు. కొల్లాపూర్ మండలం సింగోటం రిజర్వాయర్ నుంచి వీపనగండ్ల మండలం గోపాల్దిన్నె రిజర్వార్‌కు ప్రత్యేక కాల్వను ఏర్పాటు చేయాలని గత ఏడేండ్లుగా ప్రజల నుంచి ఒత్తిడి ఉంది. దీనిని గమనించిన అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా కొల్లాపూర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగసభలో సింగోటం-గోపాల్దిన్నె రిజర్వాయర్లను కలుపుతూ ప్రత్యేక కెనాల్ ఏర్పాటు చేయిస్తామని ప్రకటింపజేశారు.
అయితే, ఆ ఎన్నికల్లో జూపల్లి ఓటమి చెంది బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం రెండు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయినా ఈ కాల్వ పనులు కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా జూరాల ఎడమ కాల్వకు చివరగా ఉన్న వీపనగండ్ల, చిన్నంబాయి మండలాలకు చెందిన భూములకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పంటలు చేతికందే దశలో సాగునీరందక తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ ప్రత్యేక కెనాల్‌ను అప్పట్లో ప్రతిపాదించారు. ఐదు మండలాల రైతులకు సాగునీటి వసతి కల్పించే ఈ కెనాల్‌కు అప్పట్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన అనంతరం అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి రూ.150 కోట్లతో ప్రొసీడింగ్ తెప్పించారు.
సింగోటం-గోపాల్దిన్నె రిజర్వాయర్లను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న కెనాల్ 22కిలోమీటర్ల పొడవుంది. సింగోటం నుంచి నర్సాయిపల్లి, బొల్లారం, కొర్లకుంట, తెల్లరాళ్లపల్లి, తూంకుంట, సంగినేనిపల్లి, వీపనగండ్ల మండలాలకు చెందిన భూముల ద్వారా ఈ కెనాల్‌కు సర్వే జరిగింది. ఈ కాల్వ ఏర్పాటులో 384 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఈ ప్రకారం ఇందులో 100ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా, మరో 284 ఎకరాల్లో పట్టాదారులు ఉన్నారు. ఈ మేరకు భూసేకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈపని ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జాయింట్ ఇన్స్పెక్షన్ పేరుతో రెవెన్యూ, హార్టికల్చర్, మిషన్ భగీరథ అధికారులు గ్రామాలకు వచ్చి వెళ్తున్నారు. అయితే, భూ సేకరణ మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు.
ఈ ప్రత్యేక కాల్వను ఏర్పాటు చేయడం ద్వారా ఐదు మండలాలకు అదనపు వసతి వస్తుంది. కొల్లాపూర్‌తోపాటు కోడేరు, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబాయి మండలాలకు అదనపు వసతిగా ఉంటుంది. దాదాపు 22 కిలో మీటర్ల పొడవునా ఏర్పాటవుతున్న ఈ కెనాల్‌తో పంటలకు మరింత భరోసా వస్తుంది. అంతంత వర్షాలున్నప్పుడు జూరాల కాల్వకు నీరు సక్రమంగా రాకపోవడం, అలాగే భీమాలో అంతర్భాగంగా ఉన్న కానాయపల్లి శంకరసముద్రం నుంచి 27వ ప్యాకేజీలో 23 డిస్ట్రీబ్యూటరిలో 15వేల ఎకరాల ఆయకట్టు ఉంటే, కల్వరాల, వీపనగండ్ల, సంగినేనిపల్లి గ్రామాలకు సాగునీరందడం లేదు.
అలాగే శ్రీరంగాపురం రంగసముద్రం నుంచి 16వ ప్యాకేజీ కాల్వ ఉన్నది. ఇందులోను చివరి గ్రామాలకు సాగునీరు అంతంత మాత్రమే అందుతుంది. సింగోటం-గోపాల్దిన్నె రిజర్వాయర్ల అనుసంధానం జరిగితే 16వ ప్యాకేజీ కాల్వ సమస్యతోపాటు చివరగా ఉన్న జూరాల కాల్వ ఆయకట్టు చిన్నంబాయి మండలం సాగునీటి సమస్య కూడా శాశ్వితంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు.
జూరాల ఎడమ కాల్వపై ఉన్న గోపాల్దిన్నె రిజర్వాయర్ నుంచి ఎండకాలంలో పూర్తిస్థాయిలో సాగునీరు పంటలకు అందడం లేదు. జూరాల నుండే నీరు సక్రమంగా రాకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతున్నది. ఇక్కడి నుంచి దాదాపు 36వేల ఎకరాలకు సాగునీరందాలి. చిన్నంబావి మండలంలోని భూములకు సింహభాగం ఇక్కడి నుంచి నీరందుతుంది. అయితే వర్షాలు సమృద్ధిగా ఉంటే సమస్య లేదు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాగు నీటి కష్టాలు మొదలై రైతులు నష్టపోతున్నారు. సాగునీటితోపాటు ఇదే రిజర్వాయర్ నుంచి చిన్నంబావి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు కూడా పంపిణీ జరుగుతుం ది. ఇలా వేసవి సీజన్లో ఇటు తాగునీటి అవసరాలకు, అలాగే వ్యవసాయ పంటలకు నీటి సమస్య ఉత్పన్నమవుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే సింగోటం-గోపల్‌దిన్నె రిజర్వాయర్ల కనెక్టివిటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
సింగోటం రిజర్వార్ నుంచి గోపల్‌దిన్నె రి జర్వాయర్కు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కె నాల్ పనులు చేయడం కోసం మరో కాంట్రాక్టర్ ముందుకు వచ్చారు. గతంలో ఈ పనులు తీసుకున్న వారి నుంచి 60 సీసీ యాక్టు ద్వారా ఎంఆర్జీర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ తీసుకుంది. అయితే, ఈ కంపెనీ పనులు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నా.. భూసేకరణ అడ్డంకిగా ఉన్నది. రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుంటే తప్పా పనులు ముందుకు సాగడం కష్టం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమేర పనులు కాగా, ఇటీవల సంగినేనిపల్లి సమీపంలోను కొంత వరకు పనిని జరిపించారు. ప్రభుత్వ భూములున్న చోట మాత్రమే పనులు సాగుతున్నాయి. పట్టా భూముల్లోకి వెళ్లాలంటే భూ సేకరణ జరగాలి. రెండు జిల్లాల పరిధిలో ఉండటం కూడా నిర్లక్ష్యానికి కారణంగా చెబుతున్నారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షలు జరుపుతున్నా అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదన్న చర్చ ఉన్నది.