పెబ్బేరు, జనవరి 27 : కేసీఆర్ సర్కారులోనే క్రీడలకు ప్రోత్సాహం లభించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెబ్బేరులో చౌడేశ్వరీ జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అప్పట్లో గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అలాగే, పెబ్బేరులోనూ జూరాల క్యాంపు కాలనీలో అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి ఇరిగేషన్ శాఖకు చెందిన విలువైన పది ఎకరాల స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించి అందులో మౌలిక వసతుల కోసం రూ.10కోట్లను మంజూరు చేయించినట్లు తెలిపారు. పెబ్బేరులో చౌడేశ్వరీ ఉత్సవాల సందర్భంగా 16 సంవత్సరాలుగా హనుమాన్, ఆజాద్ యూత్ వారు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కరుణశ్రీ, మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి, మండలాధ్యక్షుడు రాములు, సింగిల్ విండో అధ్యక్షుడు జగన్నాథం, నాయకులు వెంకటేశ్, రాజశేఖర్, విశ్వరూపం, ఎల్లారెడ్డి, ఎల్లయ్య, మజీద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.