వనపర్తి టౌన్, డిసెంబర్ 7 : సమగ్ర శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆమరణ దీక్షకైనా వెనుకాడబోమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ నేతలు గద్దెనెక్కారని ధ్వ జమెత్తారు.
రేవంత్‌రెడ్డి చాయ్ తయారయ్యేలోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే జీవోను తెస్తామని నేతలు చెప్పారని.. అయితే మరి చాయ్ దొరకలేదా..? చాయిప త్తా లేదా..? చక్కెర లేదా..? పాలు లేవా..? గ్యాస్ లేదా..? అంటూ మండిపడ్డారు. ఇందుకోసమేనా ఏడాది కాలం పట్టిందని ఎద్దేవా చేశారు. న్యాయమైన డి మాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి ఉందన్నారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, రైతులు, ఉద్యోగులు.. అన్ని రంగాల ప్రజలను రేవంత్ సర్కా రు మోసం చేసిందన్నారు. కనీస వేతనం, మినిమం టైం స్కేల్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి వాహిద్ పాల్గొన్నారు.