మాగనూరు, ఫిబ్రవరి 17: మాగనూరు, కృష్ణ మండలాల్లో కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దీంతో కొందరు వృక్ష సంపదను నిలువునా నరికేస్తూ పచ్చదనం లేకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నారు. ఈ అక్రమార్కుల దాటికి విలువైన వేప, టేకు, మామిడి, చిగురు, మర్రి, చింత, నీలగిరి, ఊడుగ, రోజ్‌వుడ్ తదితర వృక్షాలు నేలకొరుగుతున్నాయి. పగటి పూట వృక్షాలను యంత్రాలతో కత్తిరించి చీకటి పడగానే ట్రాక్టర్లలో సామిల్లులకు, బట్టీలకు తరలిస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఉన్న భారీ వృక్షాలను కొందరు నాయకులు గుట్టుచప్పుడు కాకుండా కత్తరించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో కలప డీసీఎం, ట్రాక్టర్లలో అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల కళ్లముందు వెళుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విలువైన కలప.. ఇటుక బట్టీల్లో బూడిదగా మిగులుతోంది.
మాగనూరు, కృష్ణ మండలాల అడవులలో విలువైన భారీ కలప వృక్షాలు ఉన్నాయి. రైతుల పొలాల్లోనూ వివిధ రకాల కలప వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాలను కలప వ్యాపారులు పగటి పూట యంత్రాలతో నరికేస్తున్నారు. సాయంకాలం చీకటి పడగానే ట్రాక్టర్లలో పదుల సంఖ్యలో ప్రతి రోజు సామిల్లులు, ఇటుక బట్టీలకు, కర్ణాటకకు భారీగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మాగనూరు కృష్ణ మండలాలలోని వివిధ గ్రామాల నుంచి ప్రతి రోజు ట్రాక్టర్లలో కలపను తరలిస్తున్న సంగతి.. అటవీశాఖ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.