నారాయణపేట, ఆగస్టు 5 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని నారాయణపేట, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ తప్పడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సాక్షాధారాలతో సహా మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్ సాక్షిగా మంగళవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌ను నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా వివరించారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం మూడేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు ఏ విధంగా నీళ్లు ఇచ్చారో ప్రజలకు తెలుసన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని కాంగ్రెస్ భావిస్తే అప్పుడు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఒక అనుమతి తీసుక రాలేదన్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా శాశ్వతంగా నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ సీఎం అయ్యాక కేంద్రం నుంచి 11 అనుమతులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు విషయంలో క్యాబినెట్లో, అసెంబ్లీలో కూడా చర్చించి ప్రజల ముందు పెట్టినట్లు గుర్తు చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత, నేటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాను ప్రిపేర్ అవ్వలేదని సాకు చెప్పి ప్రజెంటేషన్ చూడకుండా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లడం అందరికీ తెలిసిందే అన్నారు. కాళేశ్వరం విషయ ంలో కమిటీ ఇంకా పూర్తి చదవనే లేదు.. అప్పుడే పేపర్లకు ఎవరు లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎవరి నుం చి అనుమతి తీసుకోకుండానే కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా చేపడ్తారని ప్రశ్నించారు. కొడంగల్‌లో రైతులకు ఇచ్చిన విధంగా ఎకరాకూ రూ.30 లక్షల పరిహారాన్ని ఇక్కడి భూనిర్వాసితులకు అందించాలని డిమాండ్ చేశారు. రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే పైపుల ద్వారా కాకుండా కాల్వల ద్వారా నీటిని తరలించే వారన్నారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని మక్తల్, నారాయణపేట నియోజక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీయాలన్నారు. లేకపోతే చరిత్ర హీనులుగా నిలిచిపోతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇప్పటికే 95 శాతం పూర్తి అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు చేపట్టడం లేదనే విషయాన్ని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఎస్‌ఆర్‌రెడ్డి ప్రశ్నించారు.
భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ ఎత్తిపోతలకు నీరు తీసుకువెళ్తానని అంటున్నారు.. మక్తల్ రైతులకు అన్యాయం చేసి ఇక్కడి నీటిని తరలించేందుకు ఇది మీ అబ్బ జాగీరు కాదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మార్చి 31, 2015 లో అసెంబ్లీలో కేసీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన సమయంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఆ సందర్భంగా భీమా ప్రాజెక్ట్ గురించి చర్చకు వస్తుందని భావించినప్పటికీ, అసెంబ్లీకి వెళ్లకుండా సంతకాలు చేసుకొని అప్పటి కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. రైతుల జోలికి వేస్తే పుట్టగతులు ఉండవనే విషయాన్ని రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చెరువులకు నీటిని నింపి 147 చెరువులకు అలుగు పారిస్తే, నేడు ఒక చెరువుకు కూడా అలుగు పారించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జూరాలలో రోప్ తెగిందని, చెరువులకు నీళ్లు నింపడం మరిచిపోయిందని, భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ 1.5 టీఎంసీ అని, అలాంటిది 4 టీఎంసీల నీళ్లను కొడంగల్‌కు ఎలా తీసుకువెళ్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ, మక్తల్ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, సుదర్శన్‌రెడ్డి, కన్నా జగదీశ్, విజయసాగర్, చెన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, రాములు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.