పాన్గల్, నవంబర్ 6 : ఉచిత వేరుశనగ విత్తనాలను అర్హులైన రైతులందరికీ పంపిణీ చేయాలని రై తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్యయాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సం క్షేమ కోసం నాబార్డు సహకారంతో వందశాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. కానీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అర్హులైన రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు సిఫార్స్ చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తూ విత్తనాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.
రైతులు రాస్తారోకో సమాచారం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి మణిచందర్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. మండలానికి వేరుశనగ విత్తనాల కోటా కేటాయింపు పెంచే విధంగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేయనున్నట్లు ఏవో మణిచందన్ తెలిపారు.