మూసాపేట, ఆగస్టు 14 : మండలంలోని పోల్కంపల్లి పెద్దవాగులో వెయ్యి గొర్రెలు, 11 మంది కాపరులు చిక్కుకోగా ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం గొర్రెలను వాగుదాటించి కాపరులను సురక్షితంగా రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. పోల్కంపల్లి గ్రామానికి చెందిన కాపారులు వెంకటయ్య, ఆంజనేయులు, చంద్రశేఖర్, శ్రీనివాసులు, తిరుపతయ్య, విష్ణువర్ధన్, పరశురాములు, వంశీ, మల్లయ్య, రాంచంద్రయ్యలకు చెందిన వెయ్యి గొర్రెల మందను మేతకు తీసుకువెళ్లారు.
బుధవారం రాత్రి పెద్దవాగు రెండు పాయలమధ్యలో ఎత్తైన గడ్డ ఉండడంతో ఆ గడ్డపై మందను నిలిపి అక్కడే ఉన్నారు. బుధవారం సాయంత్రం నుంచే పలు దఫాలుగా కురిసిన భారీ వర్షానికి వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో వారు ఉన్న ప్రదేశం మొత్తం మధ్యరాత్రి సమయంలో చుట్టుముట్టినట్లు తెలిపారు. తెల్లవారే సరికి తగ్గుతుందిలే అనుకున్న కాపరులకు సమయం గడిచే కొద్ది తెల్లవారుతుండగా వాగు ఉధృతి పెరగడంతో కొన్ని గొర్రెలు, పిల్లలు కొట్టుకుపోవడం గుర్తించినట్లు తెలిపారు.
దీంతో అప్రమత్తమైన కాపరులు వెంటనే తామంతా వాగులో చిక్కుకున్నామని, విషయం గ్రామ పెద్దలకు తెలియజేయాలని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులకు వారు సమాచారం ఇచ్చారు. అధికారులకు విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలంకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. విషయం గ్రామస్తులు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందిస్తూ కలెక్టర్‌కు సమాచారం అందిస్తూ రెస్క్యూ టీంను రప్పించాలని సూచించారు. దీంతో కలెక్టర్ ఘటనా స్థలం వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
అదేవిధంగా అదనపు కలెక్టర్, డీఎఫ్‌వో కిశోర్, ఎస్ఎఫ్వో మల్లికార్జున్ (ఎస్డీఆర్ఎఫ్) రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందం సభ్యులు రెండు వాహనాల్లో రెండు బోట్లతో అక్కడికి చేరుకున్నారు. 101 అంబులెన్స్‌ను నాగర్‌కర్నూల్ నుంచి రప్పించారు. అప్పటికే అక్కడికి గ్రామస్తులు సూమారు 300 వందల మందికిపైగా అక్కడికి చేరుకున్నారు. మొదట వాగు ఉధృతిని చూసి బోట్ల సాయంతో కొన్ని గొర్రెలను తీసుకోచ్చారు.
ఇలా అయితే రోజంతా తీసుకొచ్చినా కాపాడలేమని గుర్తించి గ్రామస్తులు, సిబ్బంది, అధికారులు అందరూ కలిసి తాళ్ల సాయంతో వాగులో నుంచి గొర్రెల మంద ఉన్న వరకు చేరుకున్నారు. దీంతో తాడును పట్టుకొని వాగుమధ్యలో అందరూ నిలబడి గొర్రెలను తరలించారు. కొట్టుకుపోతున్న గొర్రెలను సైతం కాపాడారు. చేయి చేయి కలిపి మొత్తం 972 గొర్రెలను, కాపరులను కాపాడారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వాగు ప్రవాహనాన్ని పరిశీలించారు. కాపాడిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. అదేవిధంగా వర్షాలకు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, వాగులు, చెరువుల వద్దకు అస్సలు వెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ రాజు, ఎస్సైలు వేణు, శ్రీనివాసులు, రామన్‌గౌడ్, నాగిరెడ్డి, శెట్టిశేఖర్తో పాటు గ్రామస్తులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.