గద్వాల, సెప్టెంబర్ 27 : ప్రకృతి ప్రకోపంతో రైతన్న కుదేలయ్యాడు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాం తాల్లో పొలాల్లోకి నీరు చేరింది.. వేల ఎకరాల్లో పంటలు వ ర్షార్పణమయ్యాయి. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జి ల్లాలోని రైతులు పెద్దమొత్తంలో నష్టపోయారు. వానకాలం సీజన్లో సాగు చేసిన పత్తి, వరి, మిరప, కంది, పొగాకుతోపాటు ఇతర పంటలను కర్షకులు సాగు చేశారు. అయితే చా లా వరకు పంటలు పాడయ్యాయి. వీటన్నింటినీ క్షేత్రస్థాయి లో అధికారులు పరిశీలించారు. నష్టం వివరాలను అంచనా వేశారు. నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపినా ఇంకా పరిహారం మాత్రం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లు మట్టి బిడ్డ రైతుకు చేయూతనిచ్చింది. రైతును రాజుగా మార్చేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతుబంధు, సకాలంలో విత్తనాలు, ఎ రువులు, పండిన పంటకు మద్దతు ధర.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీరు పుష్కలమైం ది. ఇలా రైతులకు ఎంతో చేసింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన పథకాలకు మంగళం పాడిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దీం తో సాయం.. ప్రోత్సాహకం అందక కర్షకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాం గ్రెస్ ఇచ్చిన హామీలకు సైతం పాతర వేయడంతో అన్నదాత ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. గత ప్రభుత్వ పథకాలు రావడం లేదు.. కొత్త సర్కారు అందించే పథకాలు వా రికి చెంతకు చేరకపోవడంతో దయనీయంగా తయారైంది.
ప్రకృతి రైతులపై కన్నెర్ర చేయడంతో పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణమైంది. గద్వాల జిల్లాలో వానకాలం రైతు లు వివిధ పంటలను సాగు చేశారు. గత, ప్రస్తుత నెలలో కురిసిన వర్షాల ధాటికి చేతికి వస్తుందనుకున్న పత్తి కాయలు చెట్టుపైనే నల్లబడ్డాయి. వరి నాట్లు వేయగా పొలాల్లోకి వర్షం నీరు చేరి నీటమునిగాయి.
దీంతో పం టల సాగుకు పెట్టిన పెట్టుబడి నీటిపాలైంది. నాట్ల మొదలు.. మొదటి విడుత మందుల వరకు ఎకరా వరి సాగుకు మొత్తం రూ.15 వేలకుపైగా ఖర్చయ్యిందని రైతులు తెలిపారు. అయితే తిరిగి నాట్లు వేసుకోవడంతో మొద ట పెట్టిన ఖర్చులో సగం పెట్టుబడితో మళ్లీ వేశారు. ఇక పత్తి పంటపై దెబ్బ పడింది. పత్తి కాయలు నల్ల బడడంతో దిగుబడి అంతంత మాత్రమే వచ్చే అవకాశం ఉ న్నది. వర్షాలకు దెబ్బతిన్న పంటలను రెండ్రోజులుగా పాలెం శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నారు. పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
గద్వాల జిల్లాలో కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఏఏ పంటలు ఎంత స్థాయిలో దెబ్బతిన్నాయో..? నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. అధికారులు పరిశీలించి జిల్లాలో 1,799 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అయితే, ఇప్పటివరకు నష్టానికి సం బంధించి రైతులకు పరిహారం అందలేదు. రుణమాఫీ గాక, రైతుభరోసా రాక.. పంటలను కాపాడుకునేందుకు ఆసాము ల వద్ద అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినట్లు రైతులు వాపోయారు. నష్టపరిహారం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
సాయం ఎప్పుడు అందుతుందోనంటూ కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. పత్తి 626, వరి 217, మిర్చి 260, కంది 583, పొగాకు 37, వేరుశనగ 32 ఎకరా ల్లో నష్టపోగా.. మొత్తం 1,755 ఎకరాల్లో.. టమాట, వాము, సీడ్ పత్తి, బొప్పాయి, మొక్కజొన్న, ఉల్లి, కొర్ర, జొన్న, బెం డ, ఆముదం, ఇతర పంటలు కలిపి 44 ఎకరాల్లో దెబ్బతిన్నాయని అధికారుల అంచనా.. నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఇంకా పరిహారం అందాల్సి ఉన్నది.