మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 15 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అమావాస్య కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఇంటి వద్దే ఉంచినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. దీంతో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ మొదటి రోజు సందడి కనిపించలేదు.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలన్న పాఠశాల విద్యాశాఖ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. వేసవి సెలవుల్లోనే పాఠ్య పుస్తకాలు ఆయా పాఠశాలలకు పంపిణీ చేశారు. వి ద్యాబోధన సదుపాయాలను విస్తరింపజేయడంలో ప్రభుత్వ పాఠశాలలు తమ ప్రత్యేకతను కనబర్చాలని డీఈవోలు సంబంధిత అధికారులు ఆదేశించారు. విద్యా ప్రమాణాలను పెంపుదలే లక్ష్యంగా విద్యా సంవత్సరం ఉండాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు నిర్ధేశించారు.

పాఠశాలల పునఃప్రారంభానికి అమావాస్య అడ్డంకిగా మారింది. మొదటి రోజు బడికి పంపేందుకు పలువురు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. పాఠశాలలో కొత్తగా ప్రవేశం పొందిన ప్రైవేట్ పాఠశాలలకు కొందరు తల్లిదండ్రులు అమావాస్య కావడంతో తమ పిల్లలను మొదటి రోజు పంపించడం లేదని ముందుగానే తెలియజేయడం గమనార్హం. మొదటి రోజు పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉపాధ్యాయు లు, పాఠశాల సిబ్బంది పూలు అందజేసి స్వాగ తం పలికి పాఠ్యపుస్తకాలు అందజేశారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్లైన్ పాఠశాలలోని ఓ తరగతి గదిలో బెంచీలను సైతం శుభ్రం చేయలేదు.
ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ కూలినా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాలు వెక్కిరించాయి. విద్యాశాఖ అధికారుల తనిఖీ జిల్లావ్యాప్తంగా విద్యార్థుల హాజరు శాతం పెం పుపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు సూచించారు. సోమవారం మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోని పాఠశాలలను డీఈవో విజయకుమారి, ఎంఈవోలు తనిఖీ చేశారు. పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, బోధన కార్యక్రమాల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో విజయకుమారి మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని లక్ష్యసాధనకు వేదికగా మార్చుకోవాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు.