రైల్వే అండర్‌బ్రిడ్జిలో నిలిచిన వర్షపు నీరు
30మంది విద్యార్థులు సురక్షితం
భాష్యం స్కూల్‌కు విద్యాశాఖ నోటీసులు
బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు
మహబూబ్‌నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జిలో నిలిచిన వర్షపు నీటిలో ప్రైవేట్ స్కూల్ బస్సు చిక్కుకున్నది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ మండలంలో మాచన్‌పల్లి, కోడూర్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి ఉన్నది. అయితే, శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భాష్యం టెక్నోస్కూల్కు చెందిన 30 మంది విద్యార్థులను రాంచంద్రాపూర్, మాచన్‌పల్లి సూగూర్గడ్డ తండాలో ఎక్కించుకొని మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. రైల్వే అండర్ బ్రిడ్జిలో నిలిచిన నీటిని అంచనా వేయకుండా బస్సు డ్రైవర్ అలాగే వెళ్లాడు. దీంతో బస్సు మూడో వంతు భాగం నీటిలో మునిగింది. విద్యార్థులు బస్సు కిటికీలను పట్టుకొని వేలాడుతూ కేకలు పెట్టారు. సూగూర్గడ్డ తండా యువకులు గమనించి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రాంచంద్రాపూర్ ఉపసర్పంచ్ రాంచంద్రనాయక్ తన ట్రాక్టర్‌తో బస్సును బయటకు తీశారు. చిన్నారులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేయాలని రూరల్ పోలీసులకు మహబూబ్‌నగర్ డీఈవో రవీందర్ ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
రైల్వే అండర్ పాస్ ఘటనకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అండర్‌పాస్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణ లోపాలను సరిదిద్దాలని చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు.