గద్వాల రూరల్, సెప్టెంబర్ 17 : ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి కిందికి ఒరిగిపోయి చెట్టును ఢీకొట్టిన ఘటన మంగళవారం ఉదయం పరుమాల స్టేజీ సమీపంలో చోటుచేసుకున్నది. ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయట పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే గద్వాలలోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ఉదయం వివిధ గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని గద్వాలకు బయలుదేరింది. డ్రైవర్ అజాగ్రత్తతో ఓవర్టేక్ చేశాడు.
అదే సమయంలో ఎదురుగా మరో వాహనం రావడంతో దానిని తప్పించేందుకు రోడ్డు నుంచి కిందకు దిగడంతో బస్సు ఒరిగిపోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని నిలిచిపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు భయబ్రాంతులకు గురై హహకారాలు చేశారు. బస్సు నిలిచిపోయిన వెంటనే డ్రైవర్ విద్యార్థులను కిందకు దించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని విద్యార్థులందరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విద్యార్థులను వేరే బస్సులో పాఠశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ పెద్ద ఆంజనేయులును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.