వనపర్తి, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : వనపర్తిలో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తతో మున్సిపాలిటీ మురికి కూపంగా మారింది. అధికారులకు, సిబ్బందికి చిత్తశుద్ధి కరువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చి 8వ తేదీ నుంచి ప్రభుత్వం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టింది. సీఎం రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
కానీ స్పెషల్ డ్రైవ్ మొదలై 17 రోజులైనా ఎక్కడా పనులు కనిపించడం లేదు. కేవలం రోజు వారి పనులకే మున్సిపల్ సిబ్బంది పరిమితం అవుతున్నారు. దీంతో ప్రణాళిక పటాపంచల్ అయ్యినట్లే.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ప్రజలు తీసుకెళ్లినా స్పందన
లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అంటూ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో ప్రధానంగా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్రెడ్డి పదే.. పదే చెబుతున్నారు. నూతన కార్యక్రమం ప్రారంభమై పక్షం రోజులు గడిచినా మున్సిపాలిటీలో ఎక్కడి చెత్తా అక్కడే దర్శనమిస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఎవరు చెప్పినా అంతే అన్నట్లు ఎటు చూసినా మురుగు, చెత్త దర్శనమిస్తున్నది. దీంతో సీఎం ఆదేశాలను సైతం అధికారులను బేఖాతర్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. వనపర్తి మున్సిపాల్టీ 33 వార్డులతో కొనసాగుతుండగా లక్ష జనాభాకుపైగా ఉన్న పరిస్థితుల్లో చెత్త సహితం అధికంగానే ఉంటుంది.
ఇందులో రోజూ వారి చెత్త సేకరణతోపాటు కాల్వలు ఎత్తివేయడం కూడా క్రమం తప్పకుండా ఉండాలి. కేవలం ప్రధాన రోడ్లపై ఊడ్పించడం, ట్రాక్టర్లు, ఆటోల ద్వారా దినసరి పనులు మాత్రమే నడుస్తుండటంతో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోతున్నది. ఒకటి, రెండు చోట్ల కాదు.. ఎటు చూసినా కాల్వలు, ఆ పరిసరాలు, ఖాళీ ప్రదేశాలు అన్ని చెత్తతో నిండిపోయి తీవ్ర దుర్గంధంతో కంపు కొడుతున్నాయి.
ప్రత్యేకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ ఎక్కడా కనిపించడం లేదు. ప్రధానంగా రాజకీయ ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఆ పరిమిత ఏరియాలో చూడటం మినహా సాధారణ ప్రజలున్న ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కేవలం పారిశుధ్య నిర్వహణ కోసమే ప్రత్యేక కార్యక్రమం అన్నట్లు కొనసాగిస్తున్న ఆ దిశగా కార్యక్రమాలు లేకపోవడంతో పట్టణం అపరిశుభ్రంగానే కనిపిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 8 నుంచి 99 రోజుల కార్యక్రమాన్ని ప్రకటించింది. మొదటి రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హడావుడి చేసి వదిలేశారు. సమీక్షలు, అభివృద్ధి పనులను ప్రకటించారు. నిధుల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు రోజుల అనంతరం కార్యక్రమం డీలా పడింది.
మూడు నెలల పాటు గొప్ప కార్యక్రమం అని ప్రకటించిన మూడు రోజులకే తుస్సుమంది. ఇటు ప్రజాప్రతినిదులు, అటు అధికారులు ఎవరికి వారే అన్నట్లుగా ఉండడంతో సీఎం ప్రకటించిన పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ పరిస్థితిలో పట్టణాలు, గ్రామాల్లో కేవలం రోజు వారి పనులకే ప్రణాళిక పరిమితమైంది.
పట్టణాలు, గ్రామాల సమ గ్ర వికాసం లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పట్టణ, గ్రామాల సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతినెలా నిధుల విడుదల చేయడంతో పట్టణాలు, గ్రామాల సమగ్ర అభివృద్ధికి బాటలు పడ్డాయి. పరిశుభ్రత, పచ్చదనం నిరంతర ప్రక్రియగా కొనసాగించారు.
తాగునీటి సరఫరా, రోడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలు, క్రీడా మైదానాల ఏర్పాటుతో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనివ్వడంతో అభివృద్ధి మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఇక రెండేళ్లు గ్రామాలు, ఏడాదికి పైగా పట్టణాలు ప్రజాప్రతినిధు లు లేక తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ప్రగతి ప్రణాళిక పేరుకే అన్నట్లు కొనసాగుతుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది.